చిత్తూరు జిల్లా మదనపల్లిలో సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజుకు చేరాయి. మైనార్టీలు నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర తీరుకు నిరసనగా ప్లకార్డుల నినాదాలు చేశారు. తక్షణమే ఎన్ఆర్సీ, సీఏఏ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రిలే దీక్షలు 15వ రోజుకు చేరాయి. సీఏఏను ఉపసంహరించుకోవాలని ముస్లింలు డిమాండ్ చేశారు. ఎమ్యెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
మద్దతుగా ర్యాలీలు
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. భాజపా, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 30కి పైగా వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు మద్దతు తెలిపాయి. వేలాది మందితో ఈ ర్యాలీ సాగింది. దేశంలోని ముస్లింలకు పౌరసత్వ సవరణతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని నేతలు చెప్పారు. కొన్ని పార్టీలు ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. సుగురు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి తహసీల్దార్ కార్యలయం వరకు ప్రధాన వీధుల గుండా జాతీయ జెండాలు పట్టుకుని ప్రదర్శనగా వెళ్లారు. సీఏఏ, ఎన్ఆర్సీకి మద్దతు తెలిపారు.