రైతుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. చిత్తూరు జిల్లాలోని రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్ వద్ద భాజపా మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో పాల్గొన్న ఆయన జిల్లాలో సహకార చక్కెర కర్మాగారం, విజయ డెయిరీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, స్పిన్నింగ్ మిల్లులు, డెయిరీలు అన్నీ ప్రైవేటు పరం అయ్యాయని విమర్శించారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సమానంగా నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జాతీయ రహదారులు, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిందని వివరించారు. జిల్లాలో మామిడి రైతుల్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు భాజాపా మహిళా మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందీశ్వరీ. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే భాజపా నాయకుల ధ్యేయమని స్పష్టం చేశారు.
భాజపాలోకి మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మహిళా మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో తెదేపాకు చెందిన మాజీ ఎంపీ దుర్గా, మాజీ ఎమ్మెల్యే వేంకటేశ్వర చౌదరి కాషాయ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు కోలా ఆనంద్, మైందల రామచంద్రుడు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :NARAYANA SWAMI: 'తెదేపా నేతల భూకబ్జాలపై చంద్రబాబు జవాబు చెప్పాలి'