చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో (kuppam municipal elections) వైకాపా ఓడితే జగన్ ముఖ్యమంత్రి పదవి పోతుందా? అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుపై కక్షతోనే కుప్పంలో వైకాపా అలజడి సృష్టిస్తోందన్నారు. వి.కోటలో మీడియా సమావేశం నిర్వహించిన అమర్నాథ్ రెడ్డి..పులివెందుల సంస్కృతి కుప్పంలోకి తీసుకురావద్దన్నారు. కుప్పంలో మెప్మా, వెలుగు, ఇతర ఉద్యోగులకు ఇంకా పనేంటని ప్రశ్నించిన అమర్నాథ్ రెడ్డి..దొంగ ఓట్లు వేసేందుకు వస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు.
పోలీసులు, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట
కుప్పం వస్తున్న తెదేపా నేతలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నానిని పోలీసులు అడ్డుకున్నారు. అధికారుల తీరుకు నిరసనగా తెదేపా నేతలు ధర్నా చేపట్టారు. దీంతో కుప్పం చెక్‌పోస్ట్ వద్ద ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అమర్నాథ్ రెడ్డి, నానిని వ్యానులోకి ఎక్కించేందుకు పోలీసులు యత్నించగా..తెదేపా శ్రేణలు అడ్డుకున్నాయి. దీంతో ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది.
పోలీసుల అదుపులో తెదేపా మున్సిపల్ అధ్యక్షుడు
కుప్పం తెదేపా మున్సిపల్ అధ్యక్షుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైకాపా అభ్యర్థి ఫిర్యాదు మేరకు విచారణ కోసం ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు అర్బన్ సీఐ సాధిక్ అలీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: POLLING CLOSE: ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్