రూ.2 కోట్ల పెట్టుబడితో 22 మంది సిబ్బందితో స్థాపించిన అమరరాజా పరిశ్రమ.. నేడు రూ.6 వేల కోట్ల పెట్టుబడులకు చేరుకుని 18 వేల మందికి ప్రత్యక్షంగా, 60 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని ఆ సంస్థ అధినేత గల్లా రామచంద్రనాయుడు చెప్పారు. తాను రాజకీయవేత్తను కాను.. సమాజసేవకుణ్ని, అంతకంటే మించి పారిశ్రామికవేత్తనని వ్యాఖ్యానించారు. తాను సంస్థ ఛైర్మన్‌గా వైదొలగి, యువతరానికి బాధ్యతలు అప్పగిస్తున్నానని ప్రకటించారు. ఛైర్మన్‌గా గల్లా జయదేవ్, డైరెక్టర్లుగా గౌరినేని హర్షవర్ధన్, గౌరినేని విక్రమాదిత్య వ్యవహరిస్తారన్నారు. సంస్థ ఆశయాలు, సిద్ధాంతాలను వారు కొనసాగిస్తారని వెల్లడించారు. తిరుపతి సమీపం కరకంబాడిలోని పరిశ్రమల ఆవరణలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అమరరాజా ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగుతూ రామచంద్రనాయుడు మాట్లాడారు.
దారి కూడా లేని ఊరు నుంచి వచ్చా
‘మాది చిత్తూరు జిల్లాలోని కుగ్రామం పేటమిట్ట. ఊరికి దారి, తాగడానికి నీరుండని పల్లె అది. ఓ రోజు ఆవులు మేపడానికి గ్రామానికి పక్కనున్న పెంబుగుట్టకు వెళ్లా. గుట్టపైన నిలబడి చూశాక మన ఊరే ప్రపంచం కాదు.. అది చాలా విశాలమైందని అర్థమైంది. అప్పటి నుంచి చదువుపై దృష్టి సారించా. మా ఊళ్లో పదో తరగతి పాసైన తొలివ్యక్తిని నేనే. ఉన్నత చదువులు చదివి అమెరికా వెళ్లా. చక్కటి ఉద్యోగంతో స్థిరపడ్డా. కార్లు, భవంతులు, సంతోషమైన జీవితం. ఇద్దరు పిల్లలు.. వారి ఉన్నత చదువులు అంతా బాగుంది. అలాంటి సమయంలో మా నాన్న గంగులునాయుడు స్ఫూర్తి, మావయ్య మాజీ ఎంపీ పాటూరు రాజగోపాలనాయుడు ప్రేరణతో స్వదేశానికి తిరిగి వచ్చా. ప్రవాస భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని అప్పటి సీఎం ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో ప్రేరణ పొందా. చిత్తూరు జిల్లాలో అడవులు, గుట్టలు ఎక్కువ. పంటలు పండేవి కాకుండా రాళ్లురప్పలున్న భూములను పరిశ్రమ పెట్టడానికి ఎంపిక చేసుకున్నా. మొదటగా తిరుపతి సమీపంలోని కరకంబాడి గ్రామం వద్ద రూ.2 కోట్ల పెట్టుబడితో అమరరాజా పరిశ్రమను స్థాపించా. ఆ రోజుల్లో కూడా భూసేకరణ పెద్ద సమస్యే. అనుమతులకు దిల్లీ వెళ్లాల్సి వచ్చింది. గ్రామాల్లోనే పరిశ్రమలు పెట్టాలి.. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కరకంబాడి తర్వాత పేటమిట్ట, దిగువమాఘం, యాదమరి మండలం నూనెగుండ్లపల్లె వద్ద 16 యూనిట్లను స్థాపించాం. ఉత్పత్తులు ప్రపంచంలో అగ్రగామిగా నిలిచి, 30 దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి’ అని రామచంద్రనాయుడు వివరించారు.
ఇతరులకు ఆదర్శంగా నిలిచాం
‘అమరరాజా సాంకేతిక సహకారాన్ని ఒకప్పుడు జాన్సన్ కంట్రోల్ కంపెనీ నుంచి అందుకున్నాం. ఇటీవల ఆ సంస్థ సీఈవో జార్జ్ ఒలివర్ ఇక్కడికి వచ్చి మా పరిశ్రమలను పరిశీలించారు. మేం ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సి ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. పరిశ్రమల్లో అన్ని రకాల ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తున్నాం. ఉద్యోగుల రక్షణ, వైద్య, ఆరోగ్యపరంగా ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నాం. సంస్థను నడిపేందుకు సీనియర్లతో అత్యుత్తమ వ్యవస్థ ఉంది. కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న జయదేవ్, విక్రమ్, హర్షలు అమెరికాలో పుట్టి పెరిగారు. నాయకత్వ లక్షణాల్లో నాకన్నా వారు తక్కువ కాదు. సంస్థను అగ్రగామిగా నడపడానికి ముందుంటారు’ అని చెప్పారు.
ఏడాదికో గ్రామం దత్తత
రాజన్న ట్రస్టు కింద పరిశ్రమలకు సమీపంలో ఉన్న గ్రామాన్ని ఏడాదికో దాన్ని దత్తత తీసుకుని విద్య, వైద్య, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని రామచంద్రనాయుడు చెప్పారు. పేటమిట్టలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా యువతకు మరింత శిక్షణతో తయారీ రంగంలో విదేశాలపై ఆధారపడకుండా సాంకేతిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. ఎవరిపైనో ఆధారపడకుండా స్వతహాగా తయారీ రంగంలో ఎదగాలని తన కోరిక అని వివరించారు.
ఏం జరగాలో భవిష్యత్తే నిర్ణయిస్తుంది: జయదేవ్
పరిశ్రమలు తమిళనాడుకు తరలిపోతున్నాయనే ప్రచారంపై అమరరాజా సంస్థ వైస్ ఛైర్మన్ గల్లా జయదేవ్ స్పందించారు. పరిస్థితులను బట్టి ఏం జరగాలో భవిష్యత్తే నిర్ణయిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నో వదంతులు వస్తున్నాయని, పత్రికలు, ఛానళ్లలో వస్తున్న కథనాలపై కూడా తాము స్పందించడం లేదని తెలిపారు. సంస్థ లక్ష్యాలు, క్రమశిక్షణ, నాయకత్వం కట్టుబాట్లు ఎన్నడూ విడనాడబోమని.. ఇతరుల విమర్శలు, ఆరోపణలపై స్పందించబోమని తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి:
Corona cases today: మరో 1,746 కరోనా పాజిటివ్ కేసులు.. వైరస్ తో 20 మంది మృతి