తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉపయోగించిన పుష్పాలతో పరిమళాలు వెదజల్లే అగరబత్తులు తయారుచేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. శ్రీనివాసుని ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో ఈ అగరబత్తులు తీసుకొస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది. సెప్టెంబరు 13 నుంచి వీటి విక్రయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.
ఆలోచనకు పునాది పడింది ఇలా..
తితిదే ఆలయాల్లో పూజలు, అలంకరణలకు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. పర్వదినాలు, ఉత్సవాల సమయంలో అయితే పుష్పాల వినియోగం మరింత అధికంగా ఉంటుంది. దేవతామూర్తులకు ఉపయోగించిన పుష్పాలన్నీ మరుసటిరోజు ఉదయం తొలగిస్తారు. దీంతో స్వామివారి సేవకు వినియోగించిన ఈ పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉపయోగించే విషయంపై తితిదే బోర్డు వినూత్న ఆలోచన చేసింది. ఈ క్రమంలో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ తితిదే ఆలయాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాలను అందిస్తే లాభంతో సంబంధంలేకుండా అగరబత్తులు తయారుచేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆ సంస్థతో తితిదే అవగాహన కుదుర్చుకొని ఎస్వీ గోశాలలో అగరబత్తుల తయారీకి అవసరమైన స్థలం కేటాయించింది. దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ సొంత ఖర్చుతో యంత్రాలు, సిబ్బందిని నియమించుకుని కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా అగరబత్తుల ఉత్పత్తిని ప్రారంభించింది.
అగరబత్తుల తయారీ ఎలాగంటే..
తితిదే స్థానిక ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను ఉద్యానవన విభాగం సిబ్బంది ఎస్వీ గోశాలలోని అగరబత్తుల తయారీ కేంద్రానికి తరలిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది వీటిని రకాల వారీగా పుష్పాలను వేరు చేస్తారు. అనంతరం వాటిని డ్రైయింగ్ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పిండిగా మారుస్తారు. ఆ తరువాత పిండికి నీరు కలిపి కొన్ని పదార్థాలతో మిక్సింగ్ చేస్తారు. ఈ మిశ్రమాన్ని మరో యంత్రంలో వేసి అగరబత్తులు తయారుచేస్తారు. వీటిని ప్రత్యేక యంత్రంలో 15 నుంచి 16 గంటల పాటు ఆరబెట్టిన తరువాత మరో యంత్రంలో ఉంచి సువాసన వెదజల్లే ద్రావణంలో ముంచుతారు. చివరగా వీటిని మరోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్ చేస్తారు. మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తులు తయారుచేసేలా ఏర్పాట్లు చేశారు.
ఏడు కొండలకు సూచికగా 7 బ్రాండ్లు ఇవే..
1. అభయహస్త 2. తందనాన 3. దివ్యపాద 4. ఆకృష్టి 5. సృష్టి 6. తుష్టి 7. దృష్టి
ఇదీ చదవండి: TIRUMALA: తిరుమలను హోలీ గ్రీన్ హిల్స్‌గా మారుస్తాం: జవహర్‌రెడ్డి