Lokesh yuvagalam 1st day : మొదటి రోజు పాదయాత్ర పూర్తి చేసుకున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పీఈఎస్ ఆసుపత్రికి వచ్చారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలు వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యపరిస్థితి సమీక్షించేందుకు ప్రత్యేక వైద్యులు బృందం బెంగుళూరు నారాయణ హృదయాలయ నుంచి కుప్పం వచ్చింది. లోకేష్, బాలకృష్ణలు బెంగుళూరు నుంచి వచ్చిన వైద్యుల బృందాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మరికాసేపట్లో మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగుళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరు నుంచి అత్యాధునిక పరికరాలను వైద్యులు కుప్పం పీఈఎస్ హాస్పిటల్‌కు తీసుకు తీసుకువచ్చారు. బెంగళూరు తరలించే కంటే కుప్పంలోనే వైద్య సహాయం అందిచే ఏర్పాట్లు వైద్యులు చేస్తున్నారు. తారకరత్న భార్య కుప్పం వచ్చాక బెంగుళూరు తరలింపుపై కుటుంబ సభ్యులు, వైద్యులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం కంటే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు అతని స్నేహితుడు మోహన్‌కృష్ణ తెలిపారు.
చంద్రబాబు ఆరా: అస్వస్థతకు గురైన తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తారకరత్నకు వైద్యం అందిస్తున్న కుప్పం ఆసుపత్రి వైద్యులతో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి వద్ద ఉన్న బాలకృష్ణతో పాటు, పార్టీ నేతలతో కూడా చంద్రబాబు మాట్లాడారు. తారకరత్నకు యాంజియోగ్రామ్ నిర్వహించామని, స్టంట్ అవసరం లేకుండానే తారకరత్న కోలుకున్నట్లు చంద్రబాబుకి వైద్యులు చెప్పారు. ముందు జాగ్రత్తగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. ఎయిర్ అంబులెన్స్‌లో తరలించాలన్న ఆలోచన మేరకు.. ఆయా అనుమతులపై చంద్రబాబు కర్నాటక సీఎం బొమ్మైని ఫోన్లో సంప్రదించారు.
నిలకడగా ఉంది : తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం బీపీ 120/80 చూపిస్తోందని, గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయ్యిందని వైద్యులు వెల్లడించినట్లు చెప్పారు. ఇక్కడి వైద్యులు తీవ్రంగా కృషిచేస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.
త్వరగా కోలుకోవాలి: నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు. తారకరత్న తీవ్ర అస్వస్థతకు లోను కావడం బాధాకరమన్నారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలిస్తున్నట్లు తెలిసింది.. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని.. సంపూర్ణ ఆరోగ్యవంతులై రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని పవన్ తెలిపారు.
మరోవైపు యువగళం మహా పాదయాత్ర తొలిరోజు పర్యటన ముగించుకున్న లోకేశ్.. రాత్రికి మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన క్యాంప్ సైట్లో బస చేశారు. రెండో రోజు 9.3 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగనుంది.
ఇవీ చదవండి :