Liquor Thief Remanded in Medak of Telangana : మద్యం దుకాణంలో దొంగతనానికి వెళ్లి తాగేసి అందులోనే నిద్రపోయిన దొంగను బుధవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నార్సింగి ఎస్సై అహ్మద్ మొహినుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం నేపాల్‌కు చెందిన రాజాసోద్ నార్సింగిలోని రైస్‌మిల్లులో కూలీగా పని చేసేందుకు తొమ్మిది నెలల కిందట వచ్చాడు. అందులో పని చేస్తూ, వచ్చిన జీతంతో రోజూ మద్యం తాగేవాడు.
ఇటీవల మద్యం దుకాణ పరిసరాలను పరిశీలించి కనకదుర్గ వైన్స్‌లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం ఆదివారం రాత్రి దుకాణం పైన ఉన్న రేకులను తొలగించి అందులోకి దూరాడు. అక్కడ మద్యం కనిపించడంతో వచ్చిన పని మర్చిపోయి ముందు మందు తరువాతే వచ్చిన పని అనుకున్నాడో ఏమో కానీ విపరీతంగా మద్యం తాగి మత్తులో రాత్రంతా వైన్స్ షాపులోనే నిద్రపోయాడు.
29వ తారీఖు తెల్లవారినా మత్తు దిగకపోవడంతో సోమవారం ఉదయం షాపు తెరిచిన యజమాని దొంగను గమనించి షాక్ అయ్యాడు. చోరీ చేయడానికి వచ్చాడని తెలిసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకుని మద్యం మత్తులో ఉన్న దొంగను 108 వాహనంలో సమీపంలోని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే సదరు దొంగ రాత్రి వరకు స్పృహలోకి రాకపోవడం గమనార్హం. మత్తు నుంచి తేరుకోకపోవడంతో అతడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే వివరాలు తెలియరాలేదని ఎస్సై అహ్మద్ మొయినుద్దీన్ తెలిపారు.
మద్యం సేవించి నిద్రలోకి జారుకున్నాడు - తెల్లారేసరికి
చోరీ విషయమై మద్యం షాపు యజమాని పర్ష గౌడ్ మాట్లాడుతూ తాను ఆదివారం రాత్రి వైన్స్ మూసివేసి ఇంటికి వెళ్లానని తెలిపాడు. సోమవారం ఉదయం షాప్ ఓపెన్ చేసేసరికి ఓ దొంగ మద్యం తాగి సోయిలేకుండా పడిపోయి ఉన్నాడని చెప్పాడు. అర్ధరాత్రి సమయంలో వచ్చి ఉండొచ్చని, పై కప్పు రేకులు కట్ చేసి లోపలికి వచ్చారని వెల్లడించాడు.