తిరుమలలో వివిధ సేవలను ప్రైవేటు ఏజెన్సీకి కేటాయించడంపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. పాత ఏజెన్సీలకంటే.. కొత్త ఏజెన్సీలకు తక్కువగానే నిధులను వెచ్చిస్తున్నామని ఆయన తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు కరోనాకు ముందు 176 కౌంటర్లు ఉండేవని.. పదేళ్లుగా త్రిలోక్ ఏజెన్సీ తితిదే కౌంటర్లను నడిపిందని అన్నారు. సామాజిక ప్రకటనలతో త్రిలోక్ సంస్థ ఆదాయాన్ని సమకూర్చుకునేదని వివరించారు. ఏడాదిన్నర ముందు ఆ సంస్థ కౌంటర్లు నిర్వహించలేమని తెలిపితే.. మరో ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు.
ఏడాది ముందు లడ్డూ కేంద్రంలో బ్యాంకుల ద్వారా 25 కౌంటర్లు ఏర్పాటు చేయగా.. ఏడాదిగా బ్యాంకులు 9 కేంద్రాలే నిర్వహిస్తున్నాయని తెలిపారు. బ్యాంకు ద్వారా నిర్వహించే కౌంటర్లలో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని స్పష్టం చేశారు. పాత ఏజెన్సీల కంటే తక్కువ మొత్తాలకే కొత్త ఏజెన్సీలకు చెల్లిస్తున్నామని.. నూతన ఏజెన్సీ ద్వారా ఏడాదికి రూ.56 లక్షలు ఆదా అవుతాయని అన్నారు. భక్తుల సౌకర్యార్థం కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రైవేటు ఏజెన్సీ..
లడ్డూ వితరణ కేంద్రం, కల్యాణ కట్ట కేంద్రాలు, వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు..కొత్త ప్రైవేటు ఏజెన్సీలోకి రానున్నాయి. కేవీఎమ్ ఇన్ఫోకామ్ సంస్థ.. లడ్డూ కేంద్రంలో సేవలను ప్రారంభించింది.
ఇదీ చూడండి.