సకల దేవతారూపంగా పూజించే గోమాతలు కొందరి అనాగరిక చేష్టల వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం చందమామపల్లెలో విషాదం చోటు చేసుకుంది. వేటగాళ్లు అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబు తినేందుకు యత్నించి ఆవు మృతి చెందింది.
పాడిరైతు రాంబాబు తన ఆవును మేత కోసం సమీపంలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్ళాడు. మేత కోసం వెళ్లిన ఆవు నాటుబాంబుతో పెట్టిన పండును కొరకడంతో బాంబు పేలింది. ఆవు నోటి భాగం ఛిద్రం కాగా.... విషయం తెలిసిన స్థానికులు వెంటనే పశువైద్యుడికి సమాచారం అందించారు. వైద్యుడు సకాలంలో చేరుకుని ఆవుకు తగిన చికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.. గోమాత వేదనతో మృతి చెందింది.
ఇంతక ముందు..
గతంలో జిల్లాలోని వెదురుకుప్పం మండలం, పెద్దపంజాణి, శాంతిపురం మండలాల్లోని పలు గ్రామాల్లో ఇటువంటి సంఘటనలు జరిగి... ఆవులు మృతి చెందాయి. పశువులు మేత మేసేందుకు వెళ్లే చోట నాటు బాంబులు పెట్టడం ఏంటని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ముగ్గురి ప్రాణాలు బలిగొన్న అక్రమ సంబంధం