ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన వైకాపా అధినేత వైఎస్ జగన్.. విజయవాడ వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న జగన్ ఓ అరుదైన ఘనతను సొంత చేసుకుంటున్నారు. ఓ ముఖ్యమంత్రి కొడుకుగా.. ఈ రాష్ట్రానికి సీఎం కాబోతున్నారు. ఓటమి ఎరుగని నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి .. రాజకీయ ప్రస్థానం అందరికీ సుపరిచితమే! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన.. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా చెరగని ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా.. పేరు సంపాదించుకున్నారు. ఘోర ప్రమాదంలో ఆయన అర్థాంతరంగా చనిపోయినా.. ఆయనను అభిమానించే జనం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మెండుగా ఉన్నారు. ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. తండ్రి మరణం.. తదనంతర పరిణామాలతో చిక్కుల్లో పడ్డారు. ఆ తర్వాత ఏకంగా కాంగ్రెస్ అధిష్ఠానాన్నే ఎదిరించి... సొంతగా పార్టీని స్థాపించారు. కొడితే కుంభస్థలమే అంటూ.. ముఖ్యమంత్రి పదవిపై దృష్టి పెట్టారు. తొమ్మిదేళ్లుగా అలుపెరుగని పోరాటం సాగించారు. మొదటి దఫా..సీఎం పదవి అందినట్లే అంది.. చేజారి పోయినా.. నిరాశ పడకుండా.. దండయాత్ర కొనసాగించారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించి.. నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఓ సీఎంకు కొడుకుగా.. ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా తెలుగు నేలపై ఓ సరికొత్త రికార్డును సృష్టించారు.
వైఎస్ బాటలోనే...
జగన్ కూడా తండ్రి బాటలోనే రాజకీయ అడుగులు వేశారు. వైఎస్ సొంత పార్టీలోనే నిరంతరం సంఘర్షిస్తూ.. వైఎస్ సొంత బలాన్ని పెంచుకుంటే. జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చి.. సొంత ముద్ర వేసుకున్నారు. వైఎస్ తరహాలోనే ఎప్పుడూ .. చిరునవ్వుతో కనిపిస్తూ.. తండ్రి విజయ రహస్యాన్ని ఆయుధంగా మలచుకున్నారు. ఆయన బాటలోనే నడిచారు.
తండ్రి మరణంతో...
వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా 2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు జగన్. అదేఏట కడప ఎంపీగా గెలుపొందారు. కానీ కొద్ది నెలల వ్యవధిలోనే.. సెప్టెంబర్ 2న వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. తండ్రి మరణంతో చనిపోయిన వారిని పరామర్శించేందుకు చేపట్టిన ఓదార్పు యాత్రతో కాంగ్రెస్ అధిష్టానంతో దూరం పెరిగింది. తదనంతర పరిణామాలతో జగన్ పార్టీని వీడి..సొంతపార్టీ పెట్టుకున్నారు. 2014లో అధికారం దగ్గరకొచ్చి నిలిచిపోయారు. ఈ దఫా తండ్రి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర స్పూర్తితో... ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు. 3600 కిలోమీటర్లు నడిచి తండ్రిని మరిపించారు. ఎట్టకేలకు.. ఆయన వారసుడిగా ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
ఇదీ చదవండీ: సినీ డైరీ: 40 నిమిషాల చేజింగ్.. 90 కార్లు ధ్వంసం