రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. గట్టెక్కిస్తాయనుకున్న పథకాలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. పసుపు-కుంకుమ, అన్నధాత సఖీభవ, నిరుద్యోగ భృతి ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. వెయ్యిరూపాయల పింఛన్ 2 వేలు చేసి... అధికారంలోకి వస్తే 3వేలు చేస్తామన్న హామీని ఓటర్లు పట్టించుకోనట్టే కనిపిస్తోంది.
కడుపులో ఉన్న బిడ్డ నుంచి చనిపోయిన వారికి సాగనంపే కార్యక్రమం వరకు అనేక పథకాలు తీసుకొచ్చాన్న తెలుగుదేశం... ఓటర్ల మనసు గెలుచుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఇంటింటికీ ఏదో పథకంతో లబ్ధి చేకూర్చాం ఓట్లు వేయాండని ఇచ్చిన పిలుపును పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. మొదట్లో సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు... ఆర్థిక లోటుతో తలెత్తిన సమస్యలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడే ఏర్పడ్డ జన్మభూమి కమిటీలపై వచ్చిన ఆరోపణలు జనంపై తీవ్ర ప్రభావం చూపినట్టు స్పష్టమవుతోంది. తర్వాత పరిస్థితులు సర్ధుకున్నా... జనాల్లో సానుకూల దృక్పథం రాలేదనే చెప్పాలి. అందుకే ఫలితాలు ఇంత ప్రతికూలంగా వచ్చాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక ఎత్తైతే... ఆఖరి ఏడాదిలో తీసుకొచ్చిన పథకాలూ పెద్దగా లబ్ధి చేకూర్చలేదు. నిరుద్యోగ భృతి, పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవతో ఎన్నికల్లో దూసుకెళ్లొచ్చని భావించిన ఆ పార్టీకి ఎదురు దెబ్బ తప్పలేదు. డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో 10 వేల రూపాయలు జమ చేశారు. ఆకర్షితులైన మహిళా ఓటర్లు ఆశీర్వదిస్తారు అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. రైతులకు పెట్టుబడి సాయం కోసం అన్నదాత సుఖీభవ పేరుతో... 50లక్షల మంది రైతులకు రూ.15 వేల అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులకు రెండు విడతలుగా రూ. 4వేలు జమ చేసింది. కౌలు రైతులకు ఖరీఫ్ సీజన్లో అందిస్తామని చెప్పినా కర్షకుల మనసు గెలవడంలో విఫలమైంది తెలుగుదేశం.
ఇవీ చూడండి: కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు రాజీనామా