DEAD BODY FOUND IN PARCEL : పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో భయాందోళన గురయ్యారు. మృతదేహం చూసి భయాందోళనకు గురైన మహిళ కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ జరిగింది: ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితికి ఆర్థికసాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకుంది. మొదటి విడతలో ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవాసమితి టైల్స్ అందజేసింది. అనంతరం మరోసారి ఆర్థికసాయం కోసం సదరు మహిళ దరఖాస్తు చేసుకుంది. దీంతో రెండో విడతలో విద్యుత్ సామగ్రికి బదులు పార్శిల్‌లో మృతదేహం వచ్చింది. మృతదేహం చూసి మహిళ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చెక్కపెట్టెలో పార్శిల్: యండగండి గ్రామానికి చెందిన ముదునూరు రంగరాజు కుమార్తె సాగి తులసికి నివాస స్థలం మంజూరు కాగా, ఇంటి నిర్మాణం నిమిత్తం క్షత్రియ సేవా సమితికి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకుంది. మహిళ ఆర్థిక పరిస్థితిని గమనించిన సేవా సంస్థ, మొదటి విడతలో ఇంటి నిర్మాణ సామగ్రిని అందజేసింది. మహిళ అభ్యర్థన మేరకు రెండో విడతలో విద్యుత్ సామగ్రి అందజేస్తామని సేవా సంస్థ చెప్పగా, ఈ మేరకు గురువారం రాత్రి మహిళ తల్లిదండ్రులకు ఓ చెక్కపెట్టెతో కూడిన పార్శిల్ వచ్చింది.
పార్శిల్‌తో పాటు బెదిరింపు లేఖ: పార్శిల్ విప్పి చూసిన మహిళ తల్లిదండ్రులు అందులో సుమారు 45 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి, దుర్వాసన వస్తుండటాన్ని గమనించి విస్తుపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. పార్శిల్‌లో మృతదేహంతో పాటు రూ. కోటి 30 లక్షలు చెల్లించాలి, లేదంటే మీరు ఇబ్బందుల్లో పడతారంటూ హెచ్చరికతో ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.