విభజన చట్టంలోని అంశాలు, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలన్నీ సాధించేందుకు పోరాటం కొనసాగించాలని తెదేపా ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ఎన్నికల అనంతర పరిస్థితులపై సుధీర్ఘంగా చర్చించారు. సుమారు 4 గంటలపాటు సమావేశం జరిగింది. రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలపై దాడులు, కొత్త ప్రభుత్వ పనితీరు, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలను తెలంగాణకు ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలపై చర్చించారు.
జగన్ నిర్ణయం సరికాదు...
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన భవనాల్ని తెలంగాణకు ఇచ్చేస్తూ... జగన్ తీసుకున్న నిర్ణయం సరికాదన్న కోణంలో సమావేశంలో చర్చ జరిగింది. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, ఆస్తుల విభజన పూర్తిగా జరగకుండా, తెలంగాణ నుంచి మనకు రావాల్సిన ఇతర ప్రయోజనా గురించి మాట్లాడకుండా భవనాలను వారికి అప్పగించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది.
కేంద్రంపై రాజీలేని పోరు...
ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని అంశారు, కేంద్రం ఇచ్చిన హామీల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని జయదేవ్ తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని వేడుకోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదని అనడం ద్వారా సీఎం జగన్ పోరాటాన్ని మళ్లీ మొదటికి తెచ్చారన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు.
జనం వెంటే ఉందాం..
కొత్త ప్రభుత్వ పరిపాలనపై ఇప్పుడే స్పందించకుండా వేచి చూడాలని, మంత్రివర్గం ఏర్పాటై పూర్తిస్థాయిలో పాలన గాడిన పడిన తర్వాత.. పనితీరును చూసి మాట్లాడాలని నిర్ణియించారు. నిరంతరం జనం వెంట ఉంటూ వారికి అండగా నిలవాలని, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అటు శాసన సభలోనూ, బయటా గట్టిగా మాట్లాడాలని అనుకున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందని పదే పదే చెప్పి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు వైకాపా ప్రయత్నిస్తోందన్న అంశంపై చర్చ జరిగింది.
ఇదీ చదవండీ: ప్రేమజంటపై దాడి... సామూహిక అత్యాచారం!