గిరిజనుల ఆరోగ్య భద్రత గిరిజన సంక్షేమశాఖదేనని ఆ శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. ఇళ్లు లేని గిరిజనుడు ఉండకూడదని.. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి గిరిజనుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గిరిజన జిల్లాల ఏర్పాటు విషయంలో పూర్తి స్ధాయి అధ్యయనం చేయాలన్నారు. తండాలు పంచాయితీలుగా మార్చే అంశంపై శాఖల సమన్వయం ముఖ్యమని చెప్పారు.
ఐటీడీఏల స్ధాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని, తదుపరి రాష్ట్ర స్ధాయి సదస్సు చేపడతామన్నారు. ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన అంశాలకు సీఎం తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని- ప్రతి అధికారి వాటిని ఎలా అమలు చేయాలో సమీక్షించుకోవాలని సూచించారు. గిరిజనులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సంస్థలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన కాగా, ఇందుకు తగిన ప్రాంతాన్ని గుర్తించాలన్నారు. గిరిజన జిల్లా ఏర్పాటుకు సంబంధించి వాస్తవ పరిస్ధితులపై ప్రభుత్వానికి నివేదిక సిద్దం చేయాలన్నారు.
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు గంధం చంద్రుడు, గురుకులాల కార్యదర్శి భానుప్రసాద్, సంస్ధ ఎండి రవీంద్రబాబు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ శేషు కుమార్ తదితరుల పాల్గొన్నారు
ఇదీ చదవండి