హైదరాబాద్ అంబర్‌పేటలోని డీడీ కాలనీలోని ఓ ఇంట్లో.. పవన్ కర్బంద కుటుంబం మూడేళ్లుగా నివాసం ఉంటోంది. ఇతనికి భార్య నీలం కర్బంద, కుమారుడు నిఖిల్, కుమార్తె మన్ను ఉన్నారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న నీలం కర్బందను.. వారం క్రితం సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ నెల 9న నీలం మృతి చెందారు. భార్య మృతిని జీర్ణించుకోలేకపోయిన భర్త... ఈ విషయం బంధువులెవరికీ తెలపకుండా దాచిపెట్టారు. మృతదేహాన్ని రాత్రంతా ఇంట్లోనే ఉంచాడు. ఈ క్రమంలో పవన్ కర్బంద కూడా.. గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తల్లిదండ్రుల మృతిని తట్టుకోలేక కుమారుడు నిఖిల్, కుమార్తె మన్ను... ఇంట్లో ఉన్న ఔషధాలను అన్నింటిని శీతలపానీయంలో కలుపుకొని ఈ నెల 10న తాగారు. పవన్ సోదరుడు హరిమోహన్ ఉదయం ఇంటికి వచ్చి తలుపులు తట్టినా ఎవరూ పలకకపోవడం వల్ల ఆస్పత్రి నుంచి ఇంకా రాలేదేమో అని భావించి వెళ్లిపోయారు. గురువారం ఉదయమూ ఎలాంటి సమాధానం రాకపోగా.. లోపలి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని హరిమోహన్ గమనించి ఇంటి యజమానికి చెప్పాడు. ఇరువురు కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు తీసి లోపలికి వెళ్లారు. పవన్, నీలం మృతి చెందినట్లు నిర్ధరించారు. అపస్మారక స్థితిలో ఉన్న నిఖిల్, మన్నులను... ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
పవన్ కర్బంద తాతలు కొన్నేళ్ల కిందట పంజాబ్ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. పవన్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. పేద కుటుంబానికి చెందిన పవన్ .. అబిడ్స్‌లోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. కుమారుడు నిఖిల్‌ను మాత్రం ఉన్నత చదువులు చదివించాడు. అతను చెన్నైలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారాంతాల్లో హైదరాబాద్ వచ్చి.. తల్లిదండ్రులతో ఉండి తిరిగి చెన్నై వెళ్లేవాడు. కుమార్తె మన్ను మాత్రం.. ఇంట్లోనే ఉంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది.
నిఖిల్, మన్ను ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే.. వాళ్లు ఇచ్చే సమాచారం ఆధారంగానే పోలీసులకు కీలక సమాచారం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ సోదరుడు హరిమోహన్ నుంచి పోలీసులు కొంత సమాచారం సేకరించారు.
ఇవీ చూడండి: మద్యానికి బానిసై వ్యక్తి బలవన్మరణం