దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం కాని.. పునరుద్ధరించే అంశంపై ఎలాంటి ప్రణాళికలు లేవని, అదే విషయాన్ని నితి అయోగ్ తేల్చి చెప్పిందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. అసొం లేదా ఇతర రాష్ట్రాలకు హోదా పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నారా అంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రిపున్ బోరా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ సమాధానమిచ్చారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
అసొంతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం వల్ల సమాఖ్య వ్యవస్థకు భంగం కలుగుతుందని రిపున్ బోరా అన్నారు. దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ.... ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, బిహార్, పశ్చిమబంగా వంటి రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి ఇచ్చే ఆలోచన లేదన్నారు. రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. దీనికోసం ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలంటూ సిద్ధం చేయలేదని, కానీ మంచి సలహాలు ఉంటే ఆలోచిస్తామని పేర్కొన్నారు. నితి అయోగ్ ఏర్పాటు తర్వాత రాష్ట్రాల మధ్య సంబంధాల మెరుగు కోసం తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. నితి అయోగ్ సైతం రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీతోపాటు సహకార సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేసేలా కృషి చేస్తోందని చెప్పారు.