అన్నదాతకు అండగా...
సాగును బాగు చేసేందుకు ఐదేళ్లుగా శ్రమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాబోయే ఐదేళ్లకు మరిన్ని వివరాలు ప్రకటించారు. మరోసారి తెదేపాను అధికారంలోకి తెస్తే.. అన్నదాత సుఖీభవను మరో ఐదేళ్లు కొనసాగిస్తామన్నారు. రైతులందరికీ ఉచితంగా పంటల బీమాను అందిస్తామని హామీ ఇచ్చారు. పగటిపూట నిత్యం 12 గంటలపాటు నాణ్యమైన ఉచిత కరెంటును అందిస్తామని.. 5 వేల కోట్లతో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని, కోటి ఎకరాల్లో ఉద్యాన పంటల విస్తరణ చేస్తామని భరోసా కల్పించారు.
సాగులోకి సంపూర్ణంగా 2 కోట్ల ఎకరాలు
పోలవరం సహా.. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. మళ్లీ అధికారం వస్తే.. ఈ సారి రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చేందుకు.. 2 కోట్ల ఎకరాల భూమిని సాగులోకి తెస్తామని తెదేపా హామీ ఇచ్చింది. 2019 నాటికి పోలవరం పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాదు.. అవసరాన్ని బట్టి, నీటి లభ్యతను బట్టి మరిన్ని ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తామని తెలిపింది.
నీడ లేని నిరుపేదలకు గూడు
విభజన అనంతరం.. చంద్రబాబు ప్రభుత్వం 9 లక్షల ఇళ్లను నిర్మించి నిరు పేదలకు అందించింది. మరో మారు అధికారాన్ని ఇస్తే.. శాశ్వత గృహాలు లేనివారికి గృహవసతి కల్పిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. పట్టణప్రాంతాల్లోని అర్హులకూ ఇళ్లు కట్టిస్తామన్నారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పేదలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
2013 వరకూ సబ్ ప్లాన్ పొడిగింపు
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కాలపరిమితిని 2023 వరకూ కొనసాగిస్తామని మేనిఫెస్టోలో తెదేపా హామీ ఇచ్చింది. విదేశీ విద్యకు స్కాలర్ షిప్ ను 25 లక్షల రూపాయలకు పెంచుతామని.. రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తామని, గ్రంథాలయాలు స్థాపిస్తామని భరోసా కల్పించింది.
పింఛన్ల పెంపు.. అర్హత వయసు తగ్గింపు
ఇప్పటకే వేల కోట్ల రూపాయల మొత్తాన్ని చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తోంది. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే.. 2 వేల నుంచి 3 వేలకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని తెదేపా చెప్పింది. అంతేకాదు.. పింఛనుదారుల అర్హత వయస్సు తగ్గిస్తామనీ హామీ ఇచ్చింది. చంద్రన్న పెళ్లి కానుక లక్ష రూపాయలకు.. చంద్రన్న బీమా సొమ్ము 10 లక్షలకు పెంచుతామని చెప్పింది.
పట్టణాభివృద్ధికి భరోసా
మేనిఫెస్టోలో తెదేపా మరిన్ని ఆకర్షక హామీలు ఇచ్చింది. పట్టణాల్లో గృహాలన్నింటికీ మంచినీటి సరఫరాతో పాటు.. ఆన్ లైన్ లో మున్సిపల్ సేవలు, వ్యర్థాలను శుభ్రపరిచే వ్యవస్థల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో.. సీసీఎస్ రద్దుకు అంగీకారంతో పాటు, కాంట్రాక్డ్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు హామీ ఇచ్చింది. నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 కు పెంచుతామని చెప్పింది.
కోటి మంది తోబుట్టువులకు అండగా...
కోటి మంది అక్కాచెల్లెళ్లు ఉన్న అదృష్టవంతుడిని తానొక్కడినే అని చంద్రబాబు ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటారు. ఆ మాట నిలబెట్టుకుంటా రాష్ట్ర ఆడపడుచులకు మేనిఫెస్టోలో చాలా వరాలు ప్రకటించారు. పసుపు కుంకుమ పథకం కొనసాగింపు, డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, ప్రతి కుటుంబానికి వంట గ్యాస్, వడ్డీ రాయితీ అర్హత పరిమితి 10 లక్షలకు పెంపు వంటి ఆకర్షక హామీలను ఎన్నికల హామీల ప్రణాళికలో పొందుపరిచారు.
యువశక్తికి ఆలంబనగా.. కాపులకు పెదకాపుగా..
నిరుద్యోగ భృతితో దేశవ్యాప్త దృష్టిని చంద్రబాబు ప్రభుత్వం ఆకర్షించింది. ఆ పథకాన్ని 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న యువతకు కొనసాగిస్తామని మేనిఫెస్టోలో చెప్పింది. యువత స్థాపించే పరిశ్రమలకు వడ్డీ రాయితీని అందిస్తామని తెలిపింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనీ.. నిర్మాణంలో ఉన్న కాపు భవనాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కాపుల సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయిస్తామని భరోసా కల్పించింది.
వెనకబడిన తరగతులు.. ముందుకొచ్చేలా..
పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటు.. బీసీ సబ్ ప్లాన్ చట్టానికి విధివిధానాలు రూపకల్పనతోపాటు.. బ్యాంకులతో సంబంధం లేకుండా లక్ష వరకూ రుణం ఇస్తామని తెదేపా మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అమరావతి వేదికగా బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుతో పాటు.. విదేశీ విద్యాదరణ పథకం పరిమితిని 15 లక్షలకు పెంచుతామని భరోసా కల్పించింది.
వైద్యం ఉచితం.. మందులు ఉచితం
రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికీ తెదేపా ప్రాధాన్యత ఇచ్చింది. అన్ని జిల్లాల్లో కేన్సర్ ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు.. ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా పరీక్షలు, ఉచితంగా మందులు అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.