తెదేపా నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ తెదేపా శాసనసభ్యుల సమావేశం తీర్మానం చేసింది. కార్యకర్తల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని టీడీఎల్‌పీ నిర్ణయం తీసుకుంది. వారి రక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. ఈ నెల 15న వర్క్‌షాప్‌లో దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయనుంది.
రేపు శాసనసభకు పసుపు చొక్కాలతో హాజరుకావాలని టీడీఎల్‌పీ నిర్ణయించింది. రేపు ఉదయం 9.30 వరకు తెదేపా ఎమ్మెల్యేలు చంద్రబాబు నివాసానికి చేరుకుని.. అనంతరం వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించనున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ సామర్థ్యం బయటపడుతుందని చంద్రబాబు అన్నారు. తనకంటే మిగతా నేతలే ఎక్కువ మాట్లాడాలని చంద్రబాబు కోరారు. పార్టీ పట్ల, ప్రజల పట్ల బాధ్యత తు.చ. తప్పకుండా నిర్వహించాలని సూచించారు. సమస్యల పరిష్కారంపై తెదేపా పోరాటపటిమ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. రెండు వారాలుగా జిల్లాల్లో తెదేపా శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తెదేపాపై బురద చల్లడమే లక్ష్యంగా వైకాపా పని చేస్తోందని ధ్వజమెత్తారు. పోలవరం, అమరావతి, ఇతర విషయాల్లో ఇలా చేయడం వల్ల రాష్ట్రానికి నష్టమన్నారు. శాసనసభ ద్వారా ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయాలన్నారు. రుణమాఫీ 4, 5 వాయిదాలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. 10 శాతం వడ్డీతో సహా రైతులకు ఇచ్చిన బాండ్లను గౌరవించాలని కోరారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు.