18వ తేదీన అధికం..
వేసవి దృష్ట్యా శీతలీకరణ కోసం ఎయిర్ కండీషనర్లు... ఇతర విద్యుత్ ఉపకరణాల వినియోగానికి 175 మిలియన్ యూనిట్లు అవసరమవుతున్నట్లు ఏపీ ట్రాన్స్‌కో వెల్లడించింది. ఏప్రిల్ నెలలో ఈ విద్యుత్ వినియోగం 192 మిలియన్ యూనిట్లకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీన గరిష్ఠంగా 9 వేల 130 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రంలో వినియోగించినట్లు ఏపీ ట్రాన్స్‌కో గణాంకాలు చెబుతున్నాయి.
పొరుగు రాష్ట్రాల నుంచి..
రాష్ట్రంలోని జెన్కోకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 68.9 మిలియన్ యూనిట్లు, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 5.57 మిలియన్ యూనిట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి 26.9 మిలియన్ యూనిట్లు, జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 59.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తోందని ట్రాన్స్ కో చెబుతోంది. ఇటీవల పెరిగిన డిమాండ్ మేరకు పొరుగు రాష్ట్రాల నుంచి 14 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ కొనుగోలు చేశారు.
మరింత పెరిగే అవకాశం!
మధ్యాహ్నం, రాత్రి వేళల్లో విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరుతుందని స్పష్టం చేస్తున్నారు. గతేడాది అక్టోబరు 14వ తేదీన విద్యుత్ గరిష్ఠ వినియోగం 9 వేల 453 మెగావాట్లుగా నమోదు అయ్యిందని.. వాతావరణ పరిస్థితులతో మే నెలలో విద్యుత్ డిమాండ్ పెరిగేందుకు ఆస్కారం ఉందని ట్రాన్స్ కో అంచనా వేస్తోంది. విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరుతున్నందున తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో ఉన్న 3 వేల 183 పైచిలుకు విద్యుత్ సబ్ స్టేషన్లపై విద్యుత్ లోడ్ పెరుగుతోంది.