భావితరాలకు అద్భుత కానుక ఇవ్వాలన్న లక్ష్యంతో అమరావతి నిర్మాణం జరుగుతోంది. శతాబ్దం తర్వాత అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తున్న మహానగరంలో... మౌలిక సదుపాయాల అభివృద్ధికి జపాన్, కొరియా, చైనా వంటి దేశాలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.
అద్భుత ఆలోచన- భూ సమీకరణ
అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ ద్వారా భూములు తీసుకోవాలని సంకల్పించిన చంద్రబాబు... అందులో రైతులను భాగస్వాముల్ని చేశారు. ఈ ఆలోచన రైతులను అమితంగా ఆకర్షించింది. వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారు. కేవలం రెండు నెలల్లోనే సుమారు 33 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకారపత్రాలు ఇచ్చారు. అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య స్థలాలను అన్నదాతలకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం అక్కడి భూమి విలువను పెంచింది. అప్పటి వరకు గరిష్ఠంగా 15 నుంచి 20 లక్షలు ఉన్న ఎకరం భూమి ప్రస్తుతం 2 కోట్లు దాటింది. పదేళ్ల పాటు ఆ భూములన్నింటికీ రూ. 30వేలు, రూ. 50వేల చొప్పున కౌలు చెల్లిస్తున్నారు.
భారీ ప్రాజెక్టులు వచ్చేటప్పుడు ప్రజలు నిర్వాసితులవుతారు. అమరావతి పరిధిలో మాత్రం ఒక్క గ్రామాన్ని కదిలించకపోవడం నాయకుడి దార్శనికతకు నిదర్శనం. 29 గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నారు. రహదారుల అలైన్‌మెంట్ మార్చిన ప్రభుత్వం... తప్పనిచోట కొన్ని ఇళ్లు తొలగించాల్సి వస్తే... దేశంలోనే మెరుగైన ప్యాకేజీ ఇస్తోంది.
9 థీమ్ సిటీలు, 27 టౌన్‌షిప్‌లుగా నిర్మిస్తున్న అమరావతిలో... అత్యవసర సేవలకు 5 నిమిషాల్లో, వినోద, విహార ప్రదేశాలకు 10 నిమిషాల్లో, కార్యాలయాలకు 15 నిమిషాల్లో కాలి నడకన చేరుకోవచ్చు. ఇప్పటికే 38 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. మరో 12 వేల కోట్ల పనులు టెండర్లు, ప్రణాళికల దశలో ఉన్నాయి. ఇంతటి బృహత్తర ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 1500 కోట్లే. అమరావతిలో జరిగే పనులపై కేంద్రానికి జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో వెళ్లేది మాత్రం సుమారు రూ.6,500 కోట్లు.
చంద్రబాబు విజ్ఞప్తి మేరకు... అమరావతి నగరానికి సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్‌లు రూపొందించగా... పరిపాలన నగరం, ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్న శాసనసభ, హైకోర్టు, సచివాలయం, కార్యాలయాల టవర్ల ఆకృతుల్ని లండన్‌కు చెందిన ప్రఖ్యాత నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించింది. విద్యుత్తు, నీటి సరఫరా, వంట గ్యాస్, ఐసిటీ, మురుగు పారుదల వంటివన్నీ భూగర్భంలోనే ఉండటం విశేషం.
రాజధానిలో సచివాలయ భవనాల్ని 7 నెల్లోనే నిర్మించారు. ఇందుకోసం 526.57 కోట్లు వెచ్చించారు. 2016 అక్టోబరు నుంచి సచివాలయ ఉద్యోగులు ఇక్కడి నుంచే విధులు ప్రారంభించారు. సచివాలయం ప్రాంగణంలోనే శాసనసభ భవనాన్ని 2016 ఆగస్టు 18న ప్రారంభించి, 192 రోజుల రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఆ తర్వాతే అమరావతికి పలు ప్రముఖ విద్యా సంస్థలొచ్చాయి. ప్రఖ్యాత ఎస్‌ఆర్‌ఎం... విట్-ఏపీ యూనివర్సిటీలు తొలిదశ నిర్మాణాలు పూర్తిచేసుకుని, తరగతులు ప్రారంభించాయి.
కోర్టు కేసులతో రాజధానికి అడ్డంకులు ఎదురైనా.. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగినా దృఢ సంకల్పంతో దూసుకుపోతున్నారు చంద్రబాబు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సందర్శనానికి వచ్చిన వారు... ఇక్కడి భవనాలు, రహదారులు, కార్యలాయలు చూసి శభాష్ బాబు అంటూ తిరిగి వెళ్తున్నారు.