ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు శాంతిభద్రతలపై సమీక్ష జరిగింది. డీజీపీతో సహ పలువురు పోలీసు ఉన్నతాధికారులై నివేదికలు సమర్పించారు. పారదర్శకత, నిష్పాక్షపాతం, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయటానికి తొలి ప్రాధాన్యాంశాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. బడుగు బలహీనవర్గాలు, మైనార్టీలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగేలా గ్రామాల్లో ప్రజాదర్బార్‌తో సహా ఇతర అవగహన సదస్సుల ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీనియర్ పోలీసుల అధికారులు పర్యవేక్షించేలా చూస్తామని తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు ఆరికట్టేందుకు సంచార మహిళ బృందాలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. రహదారులపై ప్రయాణికుల భద్రతపైనా దృష్టి సారించామని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో ర్యాంగింగ్ దురాచారాన్ని ఆరికట్టేందుకు కళాశాలాల్లో అవగహన సదస్సులు ఏర్పాటుకు సలహా ఇచ్చారు. సైబర్ నేరాలపై తక్షణమే స్పందించి వ్యవస్థను బలోపేతం చేస్తామని హోం మంత్రి పేర్కొన్నారు.
డిసెంబరు 12, 2018 నాటికి పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 13వేల 59 పోస్టులను భర్తీ చేసి పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తామని మంత్రి చెప్పారు.