రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులతో ముఖ్యమంత్రి నివాస పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. తమ గోడు సీఎంకు వినిపించేందుకు నిత్యం వందల మంది వస్తున్నారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కోసారి ముఖ్యమంత్రి వాహనశ్రేణికే ఆటంకం కలుగుతోంది. సచివాలయానికి, హైకోర్టుకు వెళ్లే ప్రధాన ద్వారం ఇదే కావటం సమస్య రెట్టింపు అవుతోంది. సాధారణ జనానికి అర్జీదారులు తోడై ఈ ప్రధాన దారి కిక్కిరిసిపోతోంది. రోజురోజుకీ పెరుగుతున్న అర్జీదారులతో అధికారులూ సమన్వయం చేసుకోలేకపోతున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం
ముఖ్యమంత్రి నివాస ప్రాంతానికి కొంత దూరంలో ఓ స్థలాన్ని సిద్ధం చేశారు అధికారులు. అర్జీదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇనుప రేకులతో షెడ్ ఏర్పాటు చేశారు. సమస్యలు చెప్పుకొనేందుకు సీఎం నివాసానికి వచ్చే వారి వివరాలు నమోదు చేసుకొని టోకెన్ నెంబర్ ఇస్తారు. వరుస క్రమంలో సీఎం వద్దకు పంపుతారు. మరో రెండు రోజుల్లో ఈ షెడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:ప్రజావేదిక వద్ద చెలరేగిన మంటలు