VIJAYAWADA BOOK FESTIVAL 2025: చదవడం ప్రారంభమైతే గెలవడం ప్రారంభమవుతుందని ‘ఈనాడు’ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరుకూరి రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో ఎం. నాగేశ్వరరావు మాట్లాడారు. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం అత్యంత సముచితమని అన్నారు. పుస్తకాన్ని, అక్షరాన్ని అమితంగా ప్రేమించిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. రామోజీరావు 50 ఏళ్లపాటు అక్షర తపస్సు చేశారని, ఆయన స్మృతిలో వేదికకు నామకరణం చేయడం అభినందనీయమన్నారు.
మైక్రోసాఫ్ట్ సర్వీస్ కొంతకాలం క్రితం ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన వంద మందిని ఎంపిక చేసి, వారిలో ఉండే 4 కామన్ లక్షణాలను సర్వే చేసిందని చెప్పారు. అందులోని అంశాలు లక్ష్యంపై దృష్టి సారించడం, సాహసోపేత కృత్యాలు చేయడం, ఆరోగ్య పరిరక్షణ, శరీర దారుఢ్యం కోసం కృషి చేస్తారని చెప్పారు. విజేతలందరికీ ఉన్నటువంటి లక్షణం బాగా చదవడమని, పవన్‌కల్యాణ్ కూడా గొప్ప చదువరి అని, పుస్తక ప్రియుడని చెప్పుకొచ్చారు.
బిల్‌గేట్స్ వారానికి ఒకటి చొప్పున ఏటా 50 పుస్తకాలు చదువుతారని తెలిపారు. అమెజాన్ అధినేత బెజోస్ కూడా విపరీతంగా పుస్తకాలు చదువుతారని, అదే విధంగా వారెన్ బఫెట్ కూడా పుస్తకాలు చదవడమే తన బలమని చెబుతారని అన్నారు. ఎలన్ మస్క్ కూడా తన ఆలోచనలకు మూలం పుస్తకాలే అని చెబుతారని, పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనూ బాగా పుస్తకాలు చదివేవారని అన్నారు.
12 కోట్ల మంది తెలుగువాళ్లుంటే ఒక కొత్త పుస్తకం 12 వేల కాపీలు కూడా అమ్ముడు కావట్లేదని అన్నారు. బరాక్ ఒబామా తన జీవిత చరిత్ర పుస్తకం ద్వారా కోట్ల రాయల్టీ ద్వారా సంపాదించారని తెలిపారు. చదవడం ద్వారానే మంచి పౌరులు తయారవుతారని, రామోజీరావు బాగా పుస్తకాలు చదివేవారని గుర్తు చేసుకున్నారు. ఈనాడుకు సంబంధించి రామోజీరావే ఫస్ట్ రీడర్, ది బెస్ట్ రీడర్ అని ఎం. నాగేశ్వరరావు కొనియాడారు.
"రామోజీరావు పేరు ఈ వేదికకు పెట్టడం అత్యంత సముచితం. ఎందుకంటే పుస్తకాన్ని, అక్షరాన్ని అమితంగా ప్రేమించిన వ్యక్తి రామోజీరావు. ఆయన 50 ఏళ్లపాటు ఒక తపస్సు లాగా అక్షర తపస్సు చేసి 2024 సంవత్సరంలో వెళ్లిపోయారు. ఆయన స్మృతిలో వేదికకు నామకరణం చేశారు". - ఎం.నాగేశ్వరరావు, ఈనాడు ఏపీ ఎడిటర్
జీవితంలో నిలబడేందుకు పుస్తకాలు ధైర్యానిచ్చాయి: పవన్ కల్యాణ్