High Tension in Tirupati : తిరుపతి నగరంలో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ నేత మబ్బు దేవనారాయణరెడ్డి ఇంట్లో తమ కార్పొరేటర్లు ఉన్నారంటూ మాజీ డిప్యూటీ మేయర్ అభినయరెడ్డి దాడికి యత్నించారు. రాయల్ నగర్‌లోని దేవనారాయణరెడ్డి ఇంటి వద్దకు తన అనుచరులతో చేరుకున్న ఆయన బీభత్సం సృష్టించారు. ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. దాదాపు 200 మంది అనుచరులతో కర్రలు, పైపులతో దాడికి యత్నించారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అభినయరెడ్డిని అడ్డుకొని నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి భార్య దేవనారాయణరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. తన కుమారుడు అభినయరెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బలవంతంగా తీసుకువచ్చి నిర్బంధించినా టీడీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
YSRCP VS TDP in Tirupati : అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కరుణాకర్ రెడ్డి భార్యకు నచ్చజెప్పి పంపారు. వైఎస్సార్సీపీ నేతలకు మద్దతుగా ఎంపీ గురుమూర్తి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
"మబ్బు దేవనారాయణరెడ్డి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఆయణ్ని హతమార్చేందుకు వచ్చారు. గన్లతో వచ్చారు. మొత్తం నలుగురు వచ్చారు. మేము రికార్డ్ చేయగానే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ముగ్గురిని పట్టుకున్నాం. వాళ్లను విడిపించేందుకు వైఎస్సార్సీపీ వాళ్లు వచ్చారు. మేము పట్టుకున్న వారిని పోలీసులకు అప్పగించాం. తిరుపతిలో ఇలాంటి హత్యరాజకీయాలు చేస్తారా?" - దేవనారాయణరెడ్డి అనుచరుడు