VIJAYAWADA BOOK FESTIVAL 2025: తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలే అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని, రూ.కోటి ఇవ్వడానికి ఆలోచించను గానీ పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పుస్తక మహోత్సవాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చెరుకూరి రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
పుస్తక పఠనం లేకపోతే ఏమయ్యేవాడినో: పుస్తకం ఇవ్వాలంటే తన సంపద ఇచ్చినంత మదనపడతానని పవన్ కల్యాణ్ అన్నారు. కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా గానీ తన వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వనని చెప్పారు. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుందని, తాను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదని వ్యాఖ్యానించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి నేర్చుకున్నారని అన్నారు. ఠాగూర్ ప్రేరణతో ఇంట్లో పూలమొక్కలు చూస్తూ పుస్తకాలు చదివానని చెప్పారు.
ఈనెల 12 వరకు కొనసాగనున్న పుస్తక మహోత్సవం: కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవం జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక మహోత్సవం కొనసాగుతుంది. మూడున్నర దశాబ్దాలుగా విజయవాడలో ఏటా పుస్తక మహోత్సవం జరుగుతోంది.
సాహిత్య వేదికకు రామోజీరావు పేరు: ఈ సంవత్సరం పుస్తక మహోత్సవంలో 270 స్టాళ్లు ఏర్పాటు చేశారు. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పిడికిటి రామకోటేశ్వరరావు, ప్రధాన సాహిత్య వేదికకు రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు, విద్యార్థుల కార్యక్రమాలు నిర్వహించే ప్రతిభా వేదికకు రతన్‌టాటా పేర్లు పెట్టినట్లు విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ అధ్యక్షుడు కె.లక్ష్మయ్య వెల్లడించారు.