రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదముందని ఆర్‌టీజీఎస్ హెచ్చరించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. మైదానాల్లో, చెట్ల కింద, పొలం పనులకు వెళ్లవద్దని, పశువులు, గొర్రెల కాపరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
విశాఖ జిల్లా జి.మాడుగుల, పెదబయలు, హుకుంపేట, చింతపల్లి, పాడేరు, అరకు, డుంబ్రిగుడలో పిడుగులు పడే ప్రమాదముందని ఆర్టీజీఎస్ తెలిపింది. తూర్పు గోదావరి జిల్లాలోని వై.రామవరం, మారేడుమిల్లిలో పిడుగులు పడే అవకాశాలున్నట్లు వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలోని భామిని, కొత్తూరు, పాతపట్నం, సీతంపేటలో పిడుగులు పడే ప్రమాదముందని ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయని.. రేపటినుంచి జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆదివారంలోగా తిరిగి రావాలని తెలిపారు. ప్రజలు తీరప్రాంతాలకు వెళ్లకూడదని.. సముద్ర స్నానాలు, అలలతో ఆటలు వద్దని హెచ్చరించారు.
ఇదీ చదవండి