రెండో రోజు కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ శాంతి భద్రతలు, పోలీసింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులు, సవాళ్లు, నేరాల నమోదు వంటి పలు అంశాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర పోలీసుశాఖకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని అన్నారు. వినూత్న ఆలోచనలకు ఏపీ పోలీసు విభాగం ప్రమాణాలను నిర్దేశించిందని వెల్లడించారు. సాంకేతికతపరంగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
అరికట్టడంలో సఫలీకృతం: డీజీపీ
రాష్ట్రంలో మావోయిస్టులు, వ్యవస్థీకృత నేరాలను ఆరికట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. ఐదు జిల్లాల్లో మావోయిస్టులు, వారి అనుబంధ సంస్థలు విస్తరించిన ఉన్నట్లు తెలిపారు. వారిని నియంత్రించటంలో పోలీసులు పూర్తిగా సఫలీకృతమయ్యారని స్పష్టం చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల సమస్య ఉన్నట్లు ఉద్ఘాటించారు.
మహిళలపై నేరాల్లో గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు..
ఈ సందర్భంగా రాష్ట్రంలో నమోదవుతున్న వివిధ కేసుల వివరాలు, గ్రూపులవారీగా డీజీపీ వెల్లడించారు. 2018లో కేసుల్లో వివరాలను వెల్లడించారు. 2018లో రాష్ట్రంలో మొత్తం 1,22,268 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆస్తుల కేసుల్లో విజయవాడ, తూర్పుగోదావరి అగ్రస్థానంలో ఉండగా...ఆర్థిక నేరాల్లో పశ్చిమగోదావరి, విశాఖ, విజయవాడ అగ్రస్థానంలో ఉన్నట్లు డీజీపీ పేర్కొన్నారు. రాష్ట్రంలో గతేడాది 880 హత్య కేసులు చోటు చేసుకున్నాయని సవాంగ్ తెలిపారు. మహిళలపై నేరాల్లో గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు ముందుండగా... ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలు తొలి 3 స్థానాల్లో ఉన్నట్లు ప్రకటించారు.
సైబర్, డ్రగ్స్ కేసుల్లో విశాఖ తొలి స్థానం
తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మృతులు ఉన్నారని... రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగిందని...1556 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ తరహా కేసుల్లో విశాఖ అగ్రస్థానంలో ఉండగా...డ్రగ్స్ కేసుల్లోనూ ముందంజలో ఉందని తెలిపారు. ఈ ఏడాది వైట్ కాలర్ నేరాల సంఖ్య బాగా పెరిగిందని అన్నారు.
శాంతి భద్రతలపై దృష్టి..
కులమతాల మధ్య గొడవలు కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని వీటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాయలసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల తర్వాత రాజకీయ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీలో పోలీసు సిబ్బంది కొరత ఉందని.. 12,198 మంది పోలీసులు అవసరమని డీజీపీ వెల్లడించారు. విభజన హామీల మేరకు కొత్తగా 6 ప్రత్యేక పోలీసు బెటాలియన్లు అవసరమవుతాయని పేర్కొన్నారు.