బంగాళాఖాతంలో ఫొని తుపాను ప్రభావం క్షణక్షణానికి పెరుగుతోంది. తీరానికి దగ్గరగా శరవేగంగా దూసుకువస్తున్న తుపానుపై.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి సిన్హా మరోసారి సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయ చర్యలు సిద్ధం చేయాలన్నారు. రేపు సాయంత్రానికి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని దిశానిర్దేశం చేశారు. 3న మధ్యాహ్నం ఒడిశాలోని పూరి వద్ద ఫొని తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌పైనా తీవ్ర ప్రభావం
తుపాను తీరం దాటేటప్పుడు 180 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాతోపాటు బంగాల్, ఆంధ్రప్రదేశ్‌పైనా ఫొని ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు.. సహాయచర్యలకు తీరప్రాంత భద్రతా దళం, నౌకాదళ సిబ్బంది సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 12, ఒడిశాలో 28 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించారు. బంగాల్‌లో 6 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు, అదనంగా 32 బృందాలు సిద్ధం చేశారు.