దేశంలో ఎక్కడాలేని విధంగా పెద్దఎత్తున సిమెంట్ రోడ్లు వేశామని మంత్రి లోకేశ్ ఉద్ఘాటించారు. గ్రామాల్లో 11 వేల కిలోమీటర్ల మేర గ్రావెల్ రోడ్లు, 24 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసినట్లు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉపాధి హామీ పథకం భవిష్యత్ కార్యాచరణ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి లోకేశ్... ఉపాధి పథకం సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఉపాధిహామీ కింద రాష్ట్రంలో 6 లక్షల 15 వేల పంటకుంటలు తవ్వామని వివరించారు. అన్ని పాఠశాలలకు ప్రహరీ గోడల నిర్మాణాన్ని యుద్ధ ప్రతిపాదికన చేపట్టామన్నారు. జలసిరి పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తామన్నారు.
ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందన్న లోకేశ్...పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. చిన్నవయసులోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఇస్తారని ఊహించలేదన్నారు. పల్లెటూరికి సేవచేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లేనని నాన్న చెప్పారన్న లోకేశ్...తాను అమెరికాలో చదివినా...తన దృష్టంతా పల్లెల అభివృద్ధిపైనే ఉండేదని గుర్తుచేశారు.