PM Modi Tour in AP : ప్రధాన మంత్రి మోదీ ఈ నెల 8న ఏపీ పర్యటన సందర్భంగా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్ కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రూ.413 కోట్ల వ్యయంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ముందడుగు- టెండర్లును పిలిచిన అధికారులు
పెండింగ్ డీపీఆర్
రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నా కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కోసం ముడసర్లోవ వద్ద ప్రధాన కార్యాలయ నిర్మాణానికి టెండర్లు పిలవగా ప్రధాని మోదీ ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు. ఇదిలా ఉండగా జోన్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)కు ఇంకా ఆమోదం లభించక పోవడం రాష్ట్ర ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది.
విశాఖపట్నం కేంద్రంగా జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు 2019 ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించింది. జోన్ ఏర్పాటులో అత్యంత కీలకమైన డీపీఆర్‌ను అదే ఏడాది రూపొందించారు. జోన్ స్వరూపం, వివరాలు డీపీఆర్ ద్వారానే తెలుస్తాయి. అంతటి కీలకమైన డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు గతంలోనే నివేదించినా ఇప్పటికీ ఆమోదించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నెల 8న జోన్‌కు శంకుస్థాపన చేయనుండగా జోన్‌లో వాల్తేరు డివిజన్ ఉంటుందా? ఉండదా? అనేది తెలియడం లేదు. ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు వాల్తేరు డివిజన్ కూడా చేరుస్తూ రూపొందించిన మరో డీపీఆర్ రైల్వేబోర్డు వద్ద ఉన్నట్లు సమాచారం. కొత్త డీపీఆర్ ఆమోదిస్తారా లేక మళ్లీ ఏమైనా మార్పులు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. రెండింటిలో దేనిని పరిగణనలోకి తీసుకుంటారనే విషయంపై స్పష్టత రావడం లేదు.
వాల్తేరుకు వందేళ్ల ఘన చరిత్ర
వాల్తేరు రైల్వే డివిజన్‌కు వందేళ్ల ఘన చరిత్రే ఉంది. రైల్వేబోర్డుకు గతంలో సమర్పించిన డీపీఆర్‌లో ఈ డివిజన్‌ను విజయవాడ డివిజన్‌లో కలిపుతూ రూట్లు, లైన్లు క్లియర్ చేశారు. కాగా, ప్రస్తుత డివిజన్‌ను యథాతథంగా కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తూర్పు కోస్తా పరిధిలోని వాల్తేరు డివిజన్‌లో ఒడిశాలోని రాయగడ కూడా ఉండగా రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌కు సంబంధించిన లైన్లు ఖరారు చేశారు. దీంతో వాల్తేరులో ఆదాయం వచ్చే పరిధి చాలావరకూ రాయగడ డివిజన్ పరిధిలోకి వెళ్లిపోయింది.
8న విశాఖకు ప్రధాని మోదీ - ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
విశాఖ రైల్వే జోన్‌కు భూముల కేటాయింపుపై ప్రభుత్వం ఫోకస్- ముడసర్లోవ స్థలంపై నివేదిక!