ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నకుండానే మంత్రి అయిన నారా లోకేష్.. ఈ సారి ఎక్కడి నుంచి బరిలోకి దిగనున్నారన్నదానిపై.. కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. సొంతూరు చంద్రగిరి అని.. అమ్మమ్మగారి ఊరు గుడివాడ అని.. ఉత్తరాంధ్ర భీమిలి నుంచి అని. రాయలసీమ హిందూపూర్ అని రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే పార్టీ అధినేత చంద్రాబాబునాయుడు.. లోకేష్‌ను రాజధాని నుంచి రంగంలోకి దించి ఆశ్చర్యపరిచారు. లోకేష్ మంగళగిరి బరిలోకి దిగుతారని పార్టీలో కూడా ఎక్కువ మంది ఊహించలేదు.
అయితే.. రాజధాని ప్రాంతం నుంచి కీలక నేతను నిలబెట్టాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనలు చేశారు. చంద్రబాబు కుటుంబం నుంచి.. ఒకరు రాజధాని ప్రాంతంలో పోటీ చేస్తారనే మాట.. పార్టీలో అతి కొద్ది మంది వద్ద వినిపించింది. రాజధాని ప్రాంతం తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో.. మంగళగిరి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఒకచోట నుంచి లోకేష్ పోటీ చేసే అవకాశం ఉందని భావించారు. అయితే ఎన్నికల దగ్గర కొచ్చే సమయంలో మళ్లీ ఆ ప్రస్తావన రాలేదు. దీంతో లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారని.. అందరూ అనుకుంటున్న వేళ.. చంద్రబాబు.. ఆయనకు మంగళగిరిని ఖరారు చేసి ఆశ్చర్యపరిచారు.
ప్రస్తుతం వైకాపా ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 2.5లక్షల మంది ఓటర్లున్నారు. బీసీవర్గాల ప్రాబల్యం ఎక్కువుగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 14 సార్లు ఎన్నికలు జరగ్గా... కాంగ్రెస్ పార్టీ 6... తెదేపా 2... సీపీఐ 3 సార్లు గెలిచాయి. 2014లో వైకాపా తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. తెదేపా ఆవిర్భావం తరువాత... 1983, 1985 ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసి ఎం.ఎస్.కోటేశ్వరరావు గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పోటి చేసింది మళ్లీ 2014లోనే.
1989, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో మిత్రపక్షాలకు మంగళగిరిని కేటాయించారు. అందులో 1994లో మాత్రమే సీపీఎం నుంచి రామ్మోహనరావు విజయం సాధించారు. మిగతా నాలుగుసార్లు మిత్రపక్షాలు ఓటమిపాలయ్యాయి. 2014లో తెదేపా నుంచి బరిలో దిగిన గంజి చిరంజీవి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లోనూ...తెదేపా తరపున మరోసారి పోటీ చేయాలని గంజి చిరంజీవి ప్రయత్నించారు. ఇటీవలే తెదేపాలో చేరిన మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా టికెట్ కోసం యత్నించారు. తటస్థుల కోటాలో దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ భర్త తిరువీధుల శ్రీనివాసరావు కూడా పోటీపడ్డారు. అయితే అనేక సమీకరణల తర్వాత చంద్రబాబు లోకేష్ ను ఖరారు చేశారు.
రాజధాని అమరావతి విషయంలో అడ్డుపడ్డ ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... కోర్టు కేసులు, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేశారు. తుళ్లూరు అసెంబ్లీ తెదేపా చేతిలో ఉండటంతో... అక్కడ భూసమీకరణకు ఎలాంటి అవాంతరాలు తలెత్తలేదు. కానీ మంగళగిరిలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టే భూసమీకరణ ఆలస్యమైందనేది స్థానికుల వాదన. అందుకే మంగళగిరిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ లోకేష్‌ను పోటీచేయిస్తే విజయం ఖాయమని... రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది చంద్రబాబు అభిప్రాయమని తెలుస్తోంది. లోకేష్‌ను ఖరారు చేయగానే స్థానిక నేతల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
గడచిన మూడు దశాబ్దాలుగా మంగళగిరిలో తెదేపా ప్రాతినిధ్యం లేదు. అలాంటి చోట తిరిగి పార్టీ జెండా ఎగరేయాలని తెదేపా భావిస్తోంది. తెదేపా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని ప్రాంతంలో లోకేష్ వంటి కీలకనేత ఉండాలని యోచిస్తున్నారు. అన్నింటికీ మించి తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి పోటీ చేయడం కంటే.. ప్రత్యర్థి పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట నుంచి బరిలో నిలవాలని లోకేష్ భావించినట్లు పార్టీ వర్గాల సమాచారం.