గతంలో వైకాపా సభ్యులు.. తెదేపా గూటికి చేరిన సందర్భాన్ని.. ప్రస్తుత సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. తాము మాత్రం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించేది లేదని చెప్పారు. ప్రతిపక్షానికి చెందిన సభ్యులు వైకాపాలో చేరాలంటే.. ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే అని స్పష్టం చేశారు. సభకు రావాలంటే.. పోటీ చేసి గెలవాల్సిందే అని తేల్చి చెప్పారు. నూతన సభాపతికి అభినందనలు తెలిపే సందర్భంలో.. జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో గతంలో విలువలు లేని రాజకీయాలు చూశామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనీయని సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. అన్ని విషయాలు ఆలోచించాకే సభా నిర్వహణ ఎలా ఉండాలన్న మీమాంస కలిగిందనీ.. అలాంటి అన్యాయమైన సంప్రదాయం పాటిస్తే మంచి ఎక్కడా బతకదని చెప్పారు.
వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాలని ఆలోచించే నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నా. పార్టీ కండువాలు మార్పించి మంత్రి పదవులు ఇచ్చిన వైనాన్ని చూశాం. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని తుంగలోకి తొక్కి ప్రతిష్ఠ ఎలా దిగజార్చారో చూశాం. చివరకు స్పీకర్‌పై అవిశ్వాసానికి ఉన్న నిబంధనను అప్పటికప్పుడు మార్చడం చూశాం. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని అడిగితే పట్టించుకోలేదు. అనర్హత వేటు వేయని ప్రభుత్వంపై ప్రజలే అనర్హత వేటు వేశారు - సీఎం జగన్
అన్ని మంచి గుణాలు సంపూర్ణంగా ఉన్నాయని తమ్నినేని సీతారాంను ఎంపిక చేసినట్లు జగన్ తెలిపారు. నూతన స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు సీఎం జగన్ ప్రభుత్వం తరఫున, ప్రజలందరి తరఫున అభినందనలు చెప్పారు. తమ్మినేని శాసనసభకు ఆరుసార్లు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. చట్టసభలపై మళ్లీ నమ్మకం కలిగించాలనే సీతారాంను ఎంచుకున్నామన్నారు.
ఇదీ చదవండి