మేకతోటి సుచరిత.. చాలా కాలంగానే రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె స్వస్థలం గుంటూరు జిల్లా ఫిరంగిపురం. సుచరిత బీఏ చదివారు. ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్తో ఆమెకు వివాహమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు ఆకర్షితురాలై 2006లో రాజకీయ ప్రవేశం చేశారు. 2006లో కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించారు.
2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్ స్థానంగా మారింది. ఆ ఏడాదే రాజశేఖరరెడ్డి సుచరితకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించారు. 2009లో తెదేపా అభ్యర్థి కందుకూరి వీరయ్యపై గెలిచారు. గుంటూరు జిల్లాలోని తొలి ఎస్సీ మహిళా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. వైఎస్ మరణం తర్వాత 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జగన్ వెంట నడిచారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో 16వేల మెజార్టీతో గెలిచారు. 2014లో తెదేపా నుంచి బరిలో ఉన్న రావెల కిశోర్ చేతిలో ఓటమి పాలయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా... ప్రజలకెప్పుడూ అందుబాటులోనే ఉన్నారు సుచరిత. తాజా ఎన్నికల్లో ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇప్పుడు జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఆ వెంటనే.. నవ్యాంధ్ర తొలి మహిళా హోంమంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.