అభివృద్ధి నినాదంతోనే..
ఉద్ధండులైన రాజకీయ నేతలకు ప్రాతినిధ్యం వహించిన గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి 2014లో తెదేపా తరపున గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో మరోసారి బరిలో ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో భారీ స్థాయిలో పనులు చేయటమే గాక.... వారి ట్రస్టు ద్వారా చేపట్టిన కార్యక్రలాపాలు ఈ ఎన్నికల్లో కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. రాష్ట్ర హక్కులను సాధించే క్రమంలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ.. పార్లమెంట్ వేదికగా గళమెత్తి ..అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రచార వ్యవహారాలతో పాటు కార్యకర్తల మధ్య సమన్వయ బాధ్యతలను ఆయన తల్లి గల్లా అరుణకుమారి దగ్గరుండి చూస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు బలంగా ఉండటమే గాక... మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తుండటం మరింత లాభం చేకూర్చే అంశంగా కనిపిస్తోంది. పట్టిసీమ పరవళ్లు.. మూడేళ్లుగా మాగాణులను తడపుతున్న కారణంగా రైతుల నుంచి వస్తున్న సానుకూలత తనను గెలుపుబాట పట్టిస్తుందని జయదేవ్ అనుకుంటున్నారు.
సీటు రాకపోవటంతోనే వలసలు..
సిట్టింగ్ ఎంపీకి పోటీగా వైకాపా నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జనసేన నుంచి బోనబోయిన శ్రీనివాసయాదవ్ బరిలో ఉన్నారు. వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం వరకూ తెదేపాలోనే ఉన్నారు. గుంటూరు పశ్చిమ నుంచి తెదేపా ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగుల...ఈసారి ఎంపీ టిక్కెట్ ఆశించినప్పటికి...అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రాని కారణంగా ఆయన వైకాపాలో చేరారు. జనసేన నుంచి పోటీ పడుతున్న బోనబోయిన శ్రీనివాసయాదవ్ తెదేపా నాయకుడే. ఆ పార్టీ బీసీ విభాగం అధ్యక్షునిగా ఉన్న ఆయన... గుంటూరు పశ్చిమ టికెట్ ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా టికెట్ మద్దాలి గిరికి దక్కింది. సీటు రాకపోవటం వెనుక గల్లా ఉన్నారనేదని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయం. దీంతో ఆయన తెదేపాకు రాజీనామా చేశారు. జనసేన నుంచి ఆహ్వానం అందటంతో పవన్ చెంతకు చేరారు.
గెలుపుపై ధీమా...
నిన్నటి వరకూ ఒకే పార్టీలో కలిసి మెలిసి ఉన్న నాయకులు... ఇప్పుడు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ రాజకీయాన్ని వేడెక్కించేస్తున్నారు. గల్లా జయదేవ్‌ని గుంటూరుకు విజింటింగ్ ప్రొఫెసర్ అని మోదుగుల అంటుంటే.. ఓడిపోయాక మోదుగుల కేరాఫ్ బెంగళూరు అని శ్రీనివాస్ యాదవ్ చెబుతున్నారు. వీళ్ల ఆరోపణలపై స్పందించకుండా.. జయదేవ్ సైలెంట్‌గా పనిచేసుకువెళుతున్నారు. తెదేపాను వీడిన ఇద్దరు నేతలు క్యాడర్ని మాత్రం తీసుకెళ్లలేకపోయారు. గెలుపుపై జయదేవ్ విశ్వాసం కూడా అదే..! 17లక్షల 4వేల ఓట్లు ఉన్న గుంటూరు పార్లమెంట్ స్థానంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. మరీ ఘాటుతో మండించే గంటూరు రాజకీయంలో ఉక్కిరిబిక్కిరి అయ్యేదెవరో వేచిచూడాల్సిందే.