రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చేందుకు పలు గ్రామాల ప్రజలు విముఖత చూపుతోన్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఆ అంశంపై దృష్టి సారించారు. సీఆర్డీఏపై తొలిసారి అధికారులతో సమీక్షించిన జగన్.. వీటిపై అధికారులను వివరణ అడిగారు. ఆయా గ్రామాల్లో భూములు తీసుకోవాల్సిన అవసరం ఉందా అని సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ జరపాల్సిన అవసరమేంటని ప్రశ్నించినట్లు సమాచారం.
సవిరంగా నివేదించిన యంత్రాగం
గత ప్రభుత్వంలో తీసుకున్న పలు చర్యలపై సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీ నరసింహం సహా ఉన్నతాధికారులు జగన్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్లు తెలిసింది. సీఆర్డీఏ చట్టం తీసుకువచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పురోగతిని అధికారులు కూలంకశంగా వివరించారు. రాజధానిలో భూ సమీకరణకు రైతులు ఇవ్వని 4 వేల ఎకరాల పైగా భూమిని భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. కొంత భూమికి సంబంధించి అవార్డు పాసైందని సీఎంకి వివరించినట్లు తెలిసింది. మిగతా భూమికి సంబంధించి రైతులు కోర్టుకు వెళ్లారని వివరించారు. ఎక్కువ సంఖ్యలో రైతులు భూములు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తోన్న ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల పరిధిలో భూసేకరణ చేయాల్సిన అవసరమేంటని సీఎం ప్రశ్నించారు. దీనికి అధికారులు వివరణ ఇచ్చినట్లు సమాచారం. రాజధానిలో భారీ అవినీతి జరిగిందని... వీటిపై మరింత లోతుగా అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని సమావేశం అనంతరం మంత్రి బొత్స తెలిపారు. రాజధానిలో జరిగిన అక్రమాలు సహా అవినీతి వ్యవహారంపై తెలిసిన అంశాలను తమంతట తాముగా చెప్పాలని సీఎం కోరినట్లు తెలిసింది.3 గంటల పాటు జరిగిన సమావేశంలో కీలక అంశాలపై జగన్ అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. మరో రెండు వారాల్లో మళ్లీ సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని అధికారులతో సీఎం అన్నట్లు సమాచారం.