పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి మచిలీపట్నానికి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన ఫొని. మరింత తీవ్ర రూపం దాల్చి.. ఉత్తర తూర్పు దిశలో .. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. బలమైన గాలులతో తుపాను ఉధృతంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ పారాదీప్ వద్ద తీరాన్ని తాకి బలహీనపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి స్పష్టం చేస్తోంది.
ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం
ఫొని ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి రెడ్ అలెర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావంతో విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. రేపు, ఎల్లుండి తీవ్ర గాలులతో కనిష్టంగా 120 మిల్లీ మీటర్ల నుంచి 180 మిల్లీ మీటర్ల భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయి
అప్రమత్తం చేస్తోన్న ఆర్టీజీఎస్
ఫొని తుపాన్ గమనం, రాష్ట్రంపై దాని ప్రభావాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. గాలుల వేగం, వర్ష సూచనలపై నివేదికలు అందిస్తోంది. సర్వైలెన్స్ కెమెరాల సహాయంతో.. ఆయా జిల్లాల్లో వాతావరణ ప్రభావం ఎలా మారుతుందో గమనిస్తోంది. తుపాను తీరం దాటే సమయంలో ప్రజలు బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. తుపాను కారణంగా సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ అధికారులు కోరుతున్నారు. సందర్శకులు బీచ్‌లలోకి వెళ్లకుండా స్థానిక అధికారాలను అప్రమత్తం చేస్తోంది.
ఇదీ చదవండి