గత ఎన్నికల్లో బలాబలాలు
2014లో రాష్ట్ర విభజనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన చిట్టచివరి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 102 స్థానాలు గెలుచుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. భాజపా 5 చోట్ల జయభేరి మోగించింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో చేరిన తెలుగుదేశం పార్టీ... కమలదళంతో కలిసి పోటీ చేసింది. కేంద్రంలో భాజపా ఘన విజయం సాధిస్తే... రాష్ట్రంలో సైకిల్ పరుగు పెట్టింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 16 స్థానాలు ఖాతాలో వేసకుంది ఎన్డీయే కూటమి. 175 అసెంబ్లీ స్థానాలకుగాను వైకాపా 67 స్థానాలతో సరిపెట్టుకుంది. 9 ఎంపీ సీట్లలో జగన్ జట్టు జెండా ఎగరేసింది. ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించి పోటీకి దూరంగా ఉండిపోయారు.
ఖాతా తెరవని కాంగ్రెస్..
రాష్ట్రాన్ని విభజించారన్న అపవాదును మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. 2014 ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలో ఐనా గెలవలేదు. దాదాపుగా.. పోటీ చేసిన ప్రతిచోటా డిపాజిట్లు కోల్పోయింది.
మారిన లెక్కలు...
2014 ఎన్నికల తర్వాత... గడచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో రాజకీయ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రానికి హోదా, ప్రత్యేక ప్యాకేజీ, విభజన చట్టంలోని హామీల అమలు వంటి విషయాల్లో కేంద్రంలోని అధికార భాజపా విఫలమైందని కూటమి నుంచి దూరంగా జరిగింది తెలుగుదేశం. ఎన్డీయే నుంచి బయటకి వచ్చి.. కేంద్రంపై పోరుబాట పట్టింది. ఏపీని మోదీ ప్రభుత్వం నిలువునా ముంచిందని పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టి మరీ ఎండగట్టింది. ప్రధాని నరేంద్రమోదీని నేరుగా ఢీకొట్టేందుకు ఇతర రాష్ట్రాల్లో ఎవరూ సాహసించని పరిస్థితుల్లో తెదేపా సమర శంఖం పూరించింది.
కొత్త ఫార్ములా....
ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేశారని మోదీపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు... సేవ్ ది నేషన్... సేవ్ ది డెమోక్రసీ నినాదంతో విపక్షాలను ఐక్యం చేయడంలో కీలక భూమిక పోషించారు. దశాబ్దాల వైరాన్ని వీడి... కాంగ్రెస్‌ను దగ్గరకు చేర్చుకుంది తెదేపా. దేశ ప్రయోజనాల కోసమే ఏకమయ్యామని చెప్పిన ఇరు పార్టీలు రాష్ట్రంలో మాత్రం విడివిడిగానే పోటీ చేయాలని నిర్ణయించాయి.
గతానికి భిన్నంగా....
అన్నింటికీ భిన్నంగా సంక్షేమ మంత్రాన్ని జపించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు... 2014లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆర్థిక బంధనాలు ముందుకు కదలనీయకున్నా... ఉన్నంతలో చాలా పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు. అదే ధైర్యంతో ఇప్పుడు ఎన్నికల పరీక్షకూ సిద్ధమయ్యారు.
ఎప్పుడూ ఆఖరి నిమిషం వరకు తేల్చని సీట్ల చిక్కుముళ్లను చాకచక్యంగా విప్పేశారు. దాదాపు వందకుపైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. నియోజకవర్గాల అభ్యర్థులతో విస్తృత సమావేశమై ఎక్కడా అసంతృప్తి లేకుండా నేతలంతా కలిసి పని చేసేలా దిశానిర్దేశం చేశారు. తరాల వైరంతో ఉప్పూనిప్పులా ఉన్న నేతలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి... ఒకరి విజయానికి మరొకరు సహాయపడేలా ఒప్పించడంలో చంద్రబాబు విజయం సాధించారు.
జగన్ ధీమా...
పాదయాత్రతో పార్టీ నేతల్లో ఊపు తీసుకొచ్చి ఎన్నికల సమరానికి సిద్ధమైన వైకాపా అధినేత జగన్... ముందుగానే నవరత్నాల పేరుతో సగం మేనిఫెస్టో ప్రకటించి ప్రచారానికి ఏడాది కిందటే తెరలేపారు. భారతీయ జనతా పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉందన్న అధికార పార్టీ విమర్శలు తిప్పికొడుతూ ఒంటరిగానే బరిలో ఉంటామని తేల్చేశారు. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ... లోటస్‌పాండ్ వేదికగా అధికార పార్టీ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ రాజకీయలను రంజుగా మార్చారు.
ప్రశ్నిస్తామంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్... వామపక్షాలతో కలిసి నడిచేందుకి సిద్ధమయ్యారు. కిందటిసారి పోటీ చేయకుండానే తెలుగుదేశం, భాజపాకు మద్దతు ఇచ్చినా... ఈసారి వైవిధ్యమైన పంథా ఎంచుకున్నారు. అధికార, ప్రతిపక్షాలను తూర్పారబడుతూ.... ప్రజల మనసులు గెలవాలని భావిస్తున్నారు.
తెదేపాతో కలిసి పోటీచేసి.. 2014లో 5 అసెంబ్లీ స్థానాలతోపాటు 2 పార్లమెంట్ స్థానాలు గెలిచిన కమలం పార్టీ... ఈ సారి సిట్టింగ్‌లనే కాపాడుకోవటానికి ప్రయత్నిస్తోంది. వారిలో ఒకరు పార్టీ మారగా... ఇంకొకరు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. మిగిలిన వారిలోనూ కొందరు ఊగిసలాట ధోరణితో ఉన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న ప్రచారాన్ని తిప్పికొట్టి వీలైనన్ని స్థానాల్లో విజయబావుటా ఎగరేయాలని భావిస్తోందీ కాషాయదళం.
2014లో ఘోరంగా ఓడిపోయిన హస్తం పార్టీ... హోదా నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఆ పార్టీ.... హోదా భరోసా యాత్ర చేపట్టి... ప్రజలకు చేరువయ్యేందుకు యత్నించింది. తిరుపతి వేదికగా రాహుల్‌తో సభ పెట్టించి... శ్రేణుల్లో విజయకాంక్ష రగిల్చే పని పూర్తి చేసింది.
నవ్యాంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికల్లో రాజకీయాలు మాత్రం కిందటిసారి కంటే మరింత రంజుగా మారాయి. ఓట్ల తొలగింపు అంశం ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల పర్వం కొనసాగిస్తున్నారు. షెడ్యూల్ ప్రకటన తర్వాత వేసవి ఎండలనుమించి... ఏపీ రాజకీయమూ మరింత మోతెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.