డీఎస్సీ 2018 నియామక ప్రక్రియలో జాప్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో... పాఠశాల విద్యా శాఖ ప్రాథమిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి సెప్టెంబర్ 4 వరకు నియామక ప్రక్రియ కొనసాగనుంది. న్యాయ వివాదాల కారణంగా తెలుగు భాషా పండితులు, హిందీ భాషా పండితులు, తెలుగు స్కూల్ అసిసెంట్, హిందీ స్కూల్ అసిస్టెంట్, పీఈటీ పోస్టులను మినహాయించి మిగిలిన అన్ని కేటగిరీల పోస్టులకూ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 7వేల పైచిలుకు పోస్టుల భర్తీకి డీఎస్సీ–2018 నోటిఫికేషన్‌ను గతేడాది అక్టోబర్లో విద్యాశాఖ విడుదల చేసింది. ఎన్నికలకు ముందు ఫలితాలను విడుదల చేసి... మెరిట్ జాబితాను ప్రకటించింది. పోస్టుల భర్తీకి తాజాగా ప్రభుత్వం అనుమతి లభించినందున.. ప్రాథమిక షెడ్యూల్‌ను ప్రకటించింది.
అంతా ఆన్లైన్లో..
ఆయా కేటగిరీల పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్ (సీఎస్ఈ) ఆన్‌లైన్ పర్యవేక్షణలో కొనసాగనుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అనంతరం... పాఠశాలల ఎంపికకు వీలుగా వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. పోస్టింగ్ ఆర్డర్లను కూడా ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఎంపికైన అభ్యర్థి ఎవరైనా పోస్టింగ్ కోసం ప్రాంతాన్ని ఎంపిక చేసుకోలేని పక్షంలో అతనికి నియామకాధికారులే కేటాయింపు చేస్తారు. ఈ నెల 20వ తేదీ నుంచి టీచర్ పోస్టులకు అర్హులైన వారి ఎంపికకు పాఠశాల విద్యా శాఖ తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సెప్టెంబర్ 4 వరకు కొనసాగనుంది