నగరి ఎమ్మెల్యే... రోజా. తెదేపాపై ఎప్పుడూ మాటల అస్త్రాలను సంధిస్తూనే ఉంటారు. రోజాను ఎలాగైనా ఓడించాలని తెదేపా పట్టుదలతో ఉంది.సీమలో పాగా వేయాలనుకోవడమూ ఈ లక్ష్యంలో భాగమే.నియోజకవర్గంలో సత్తా ఉన్న నేతకే టికెట్ ఇవ్వాలని తెదేపా అధిష్ఠానం భావించింది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గాలి భానుకు టికెట్ ఇచ్చింది.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించేందుకు తెదేపా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు పసుపు దళానికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. ఎలాగైనా జెండా ఎగరేయాలని, పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని సైకిల్ పార్టీ ప్రయత్నిస్తోంది. ముందుగా కాస్త తర్జనా భర్జన పడినా... తర్వాత దేవినేని అవినాష్‌ను అస్త్రంగా వదిలింది. పార్టీ జిల్లా నాయకత్వమంతా ఏకమైంది. యువకుడైన అవినాష్‌కు వెనుక ఉండి వ్యూహాలు రచిస్తోంది. దేవినేని వారసుడువచ్చాక నియోజకవర్గం కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య హోరాహోరీఉంది. పోలింగ్ తేదీ లోగా.. వైకాపాను పడగొట్టాలని తేదాపా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
తెదేపా ప్రధానంగా దృష్టి సారించిన మరో నియోజకవర్గం... చంద్రగిరి. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే. దూకుడుగా ఉండే చెవిరెడ్డి అనేక సందర్భాల్లో తెదేపాను చికాకు పెట్టారు. అన్నింటికీ మించి .. అది పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం. అధినేత సొంత నియోజకవర్గంలో ప్రతిపక్షం ప్రాతినిధ్యం వహించడం తెదేపా వర్గాలకు ఇబ్బందికరంగా ఉంది. ఆ విధంగా చూసినా ఈ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవడానికి పార్టీ ప్రయత్నిస్తోంది. చెవిరెడ్డితో సమానంగా దూకుడుగా ఉండే పులివర్తి నానిని చాలా ముందుగానే అభ్యర్థిగా ప్రకటించింది.
నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ స్థానాలను ఈసారి తెదేపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పట్టణం ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ ఉంటే... గ్రామీణం ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ ఉన్నారు. వీరిరువురూ కూడా తెదేపాపై ఆరోపణలతో ఇబ్బంది సృష్టిస్తూ ఉంటారు. ఇక్కడ పసుపు వర్ణం వెదజల్లాలని అధిష్ఠానం అభిప్రాయపడుతోంది. సిటీ నుంచి మంత్రి నారాయణను రంగంలోకి దింపింది. సమీకరణాలు వేసుకున్న తర్వాత రూరల్ నుంచి అబ్దుల్ అజీజ్ ను తెరపైకి తీసుకువచ్చి గెలుపు వ్యూహాలు పన్నుతోంది.