సభలో ఎలా ప్రసంగించాలి అనే అంశంపై అందరికీ అవగాహన అవసరమని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. అసెంబ్లీలో ఒక సబ్జెక్ట్‌పై మనం మాట్లాడుతున్నప్పుడు పూర్తి సమాచారంతో రావాలి అని అన్నారు. సమాచారం లేకుండా తప్పు మాట్లాడితే ఇతరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని అన్నారు. "గత ప్రభుత్వం వ్యవహరించిన విధంగా మనం ప్రవర్తించం... తెదేపా నుంచి ఐదుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చాలామంది చెప్పారు. మనం ఇతర పార్టీల నుంచి తీసుకుంటే వాళ్లకు, మనకు తేడా ఏమి ఉంటుంది. ఇతరులు వస్తే ఆ పార్టీకి రాజీనామా చేసి ఉండాలి తప్ప మనం తీసుకోమని చెప్పాం. మనపై మనకు నమ్మకం ఉన్నప్పుడు ఎవరు మాట్లాడినా ఫర్వాలేదు. ఇతర పార్టీలవారు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. వారు చేస్తున్న ఆరోపణలకు మనం గట్టిగా సమాధానం చెప్పాలి. ఏరోజు ఏ అంశం చర్చకు వస్తుందో... వాటిపై ముందుగానే తెలుసుకోవాలి. ఆయా అంశాలపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. సమగ్ర సమాచారంతో అప్రమత్తంగా ఉంటే చక్కగా మాట్లాడవచ్చు. శాసనసభను హుందాగా నడిపిస్తాం... ఏమాత్రం సందేహం లేదు. అందరం కలిసికట్టుగా శాసనసభను గొప్పగా నడిపిద్దాం" అని ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు.
సభా సమయాన్ని వృథా చేయకండి: తమ్మినేని
శాసనసభ నిర్వహణ విజయవంతానికి సభ్యులకు శిక్షణ అవసరమని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శాసనసభ వ్యవహారాలపై సభ్యులు అవగాహన పెంచుకోవాలి సూచించారు. శాసనసభ సమయాన్ని వృథాచేయడం మంచిది కాదని సభ్యులకు సభాపతి సూచించారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే అర్ధవంతమైన చర్చలు జరగాలని దిశానిర్దేశం చేశారు.