కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు తీవ్రంగా స్పందించారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందంటూ... ఎన్నికల సంఘం అధికారుల వైఖరిని ఎండగడుతూ నాలుగు పేజీల లేఖను సంధించారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఈనెల 19న 5పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అనేక పోలింగ్ కేంద్రాలల్లో చాలా ఫిర్యాదులు వచ్చాయని... దీనిపై తెదేపా ఈసీకి ఫిర్యాదు చేసిందని గుర్తుచేశారు.
చంద్రగిరిలో ఓట్ల తొలగింపుపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తున్నా... ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి మద్ధతు లభించడం లేదని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. తమ పార్టీ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోకుండా పక్కన పెట్టడం బాధస్తోందని.. వైకాపా అభ్యర్థులు ఇస్తున్న ఫిర్యాదులపై మాత్రం ఆఘమేఘాలపై స్పందింస్తుండడం దారుణమన్నారు. రీపోలింగ్ నిర్వహించాలంటూ... గత నెల 12న తెలుగుదేశం పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం గుర్తుచేశారు. రాష్ట్రంలో ఒకమారు రీపోలింగ్ నిర్వహించిన అనంతరం రెండో మారు చంద్రగిరిలో రీపోలింగ్ అంటూ... ఈసీ నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు.
కేవలం వైకాపా ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఏవిధంగా రీపోలింగ్ దశలవారీగా నిర్వహిస్తారంటూ... ప్రశ్నించారు. ఫలితాల తర్వాత కూడా వైకాపా నుంచి ఫిర్యాదులు వస్తే రీపోలింగ్ నిర్వహిస్తారా అని ఎద్దేవా చేశారు. భాజపా... దాని మిత్రపక్షాల ఫిర్యాదులపై కాంతివేగంతో స్పందిస్తున్న ఎన్నికల సంఘం... విపక్షాల ఫిర్యాదులపై నత్తనడకన వ్యవహరించటం సమంజసం కాదని చంద్రబాబు లేఖలో పేర్కోన్నారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన సంఘటనపైనా ఈసీ ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. అమిత్ షా ఫిర్యాదుపై తక్షణం స్పందించారని... అక్కడ అల్లర్లు సృష్టించింది... ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని తొలగించిందీ భాజపానే అంటూ స్థానిక మీడియాలోనూ వార్తలొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
మోదీ సభలు పూర్తయ్యాయి కాబట్టే ప్రచారాన్ని నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవటం దారుణమని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఏపీ, బెంగాల్ల రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, రీపోలింగ్ నిర్వహణ, ఏకపక్షంగా ఎన్నికల ప్రచారాన్ని నిలుపుదలకు ఆదేశాలు ఇవ్వడం... మాయావతి వంటి నేతలపై కావాలనే చర్యలు తీసుకోవడం...ఈసీ పక్షపాతానికి నిదర్శనమని ఆరోపించారు. ఎన్నికల సంఘం భాజపాకు సరెండర్ అయినట్టుగా వ్యవహరించటం దారుణమని తన లేఖలో చంద్రబాబు ఆరోపించారు. 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలని 22 విపక్ష పార్టీలు కోరినా పట్టించుకోని ఈసీ... నిబంధనలకు విరుద్ధంగా దశలవారీగా రీపోలింగ్ నిర్వహించటం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తన నిష్పాక్షికతను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో ఘాటుగా పేర్కోన్నారు.
ఇదీ చదవండి...