''నదుల అనుసంధానంతో నీటి కొరతను అధిగమిస్తున్నాం. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేశాం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అసలు నీటి కొరతే ఉండదు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం. కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జిలు వస్తాయి. మన కష్టాన్ని దోచుకున్నారు... కట్టుబట్టలతో వచ్చాం. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని ముందుకెళ్లా. నేను అందరివాడిలా ఉంటా. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశాం. బిడ్డలు భారం కాదు... బడికి పంపండి. బడికి పంపిస్తే తల్లిదండ్రులకు ఏటా రూ.18 వేలు ఇస్తాం. అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా తల్లికి రూ.18 వేలు ఇస్తాం. పేద పిల్లలందరినీ ఇంజినీర్లు, వైద్యులుగా చేసే బాధ్యత నాది. విదేశాల్లో చదువుకునేందుకు రూ.25 లక్షలు ఇస్తాం.'' - చంద్రబాబు, ముఖ్యమంత్రి
కేసీఆర్‌తో కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలు చేశారు. విభజన సమయంలో రావాల్సిన రూ.లక్ష కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపించారు. ఆంధ్రా ప్రజలను కేసీఆర్ దూషించారని గుర్తు చేశారు. పోలవరాన్ని నిలిపివేయాలని కేసీఆర్ కోర్టుకు వెళ్లారని చెప్పారు. భద్రాచలాన్ని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రానికి భద్రాచలాన్ని ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కోడికత్తి పార్టీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఏపీకి మోదీ తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు బయల్దేరినప్పుడు తన మనవడు ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే... రాష్ట్రం కోసం తను పడుతున్న కష్టం చూపించాలని సభకు తీసుకువచ్చినట్టు చంద్రబాబు చెప్పారు.