జగన్ పాలనలో రానున్న రోజులు ఎంత అధ్వాన్నంగా ఉండబోతున్నాయో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పష్టం చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అమ్మఒడి పథకానికి అన్ని ఆంక్షలా అని ప్రశ్నించిన ఆయన... హామీ ఇస్తే అమలు చేసే సత్తా ఉండాలన్నారు. ఆ సత్తాగానీ, చిత్తశుద్ధిగానీ వైకాపా ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. జగన్ నోటికొచ్చిన హామీలతో చిటికెల పందిరి కట్టారని ఎద్దేవా చేశారు. ఇక ఆ పందిరిపై అభివృద్ధి, సంక్షేమాన్ని పాకించి పండిస్తామంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇది అయ్యే పనేనా అని ప్రశ్నించారు. రాజధానికి 500 కోట్లు, కడప స్టీల్ ప్లాంట్‌కు 250 కోట్లు రూపాయలు కేటాయించి ఏం కట్టాలను కుంటున్నారో చెప్పాలన్నారు. ప్రజల ఆకాంక్షల్ని ఎందుకిలా నీరు గార్చుతున్నారని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు 5ఏళ్లపాటు 75వేలు ఇస్తామని... డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పి... బడ్జెట్‌లో వాటి ప్రస్తావనే లేదన్నారు. సున్నా వడ్డీ రుణాలకు 1,788 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.