BR Naidu Sworn in TTD Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం భూవరాహ స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకున్నారు. ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో గరుడాళ్వర్ సన్నిధి వద్ద టీటీడీ ఈవో శ్యామలరావు బీఆర్ నాయుడితో ప్రమాణం చేయించారు. టీటీడీ 54వ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం బీఆర్ నాయుడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈవో శ్యామలరావు బీఆర్ నాయుడు దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్ర పటాన్ని వారికి అందజేశారు. మరోవైపు ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదు నెలల తర్వాత టీటీడీ పాలక మండలి తిరుమలలో కొలువు తీరింది.
తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు తప్పవని తితిదే ఛైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఉదయం టీటీడీ నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన బీఆర్ నాయుడు స్థానిక అన్నమయ్య భవనంలో తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఇవాళ పాలక మండలి సభ్యులుగా ప్రమాణం చేసిన దేవాదాయశాఖ సెక్రటరీ సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జంగా కృష్ణమూర్తి, మల్లెల రాజశేఖర్ గౌడ్, జాస్తి పూర్ణ సాంబశివరావు, ఎం.ఎస్.రాజు, నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగ శ్రీ, ఆనంద్ సాయి, జానకి దేవి తమ్మిశెట్టి, ఆర్.ఎన్. దర్శన్, ఎం. శాంతారామ్, ఎస్. నరేష్ కుమార్, డాక్టర్ ఆదిత్ దేశాయ్‌లతో సమావేశమయ్యారు. అనంతరం భక్తులను ఉద్దేశించి బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు.
టీటీడీ ఛైర్మన్‌గా తనకు చాలా సవాలు ఉన్నాయి. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై న్యాయ పోరాటం చేస్తాం. సీఎం చంద్రబాబుకు దృష్టికి తీసుకొని వెళ్లి చర్యలు తీసుకుంటాం. శ్రీవాణి ట్రస్టు నిధులు పక్కదోవ పట్టినట్లు ప్రజల్లో అపోహలు ఉన్నాయని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. గత బ్రహ్మోత్సవాలను ధర్మకర్తల మండలి లేకపోయినా టీటీడీ అధికారులు చంద్రబాబు సూచనల మేరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. -బీఆర్ నాయుడు, టీటీడీ ఛైర్మన్