Healthy Alternatives for Mayonnaise: మయొనైజ్.. ప్రస్తుత రోజుల్లో ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఏ రెస్టారెంట్‌కి వెళ్లి కరకరలాడే ఆహార పదార్థాలను ఆర్డర్ చేసినా మయొనైజ్ తప్పక ఉంటుంది. మండి బిర్యానీ, చికెన్ కబాబ్, పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, ఫ్రెంచ్‌ఫ్రైస్.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల వాటికి సూపర్ కాంబినేషన్ అంటే మయొనైజ్ గుర్తుకువస్తుంది. కేవలం రెస్టరెంట్లకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు.. ఇంట్లో కూడా దీనిని తినేవారు లేకపోలేదు. అయితే ఇది ఎంత టేస్ట్‌గా ఉంటుందో.. మయొనైజ్‌ని సరైన పద్ధతుల్లో తయారు చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుందనడానికి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే ఉదాహరణ. తాజాగా దీన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. మరి మయొనైజ్ తినడం ఎలా అని ఆలోచిస్తున్నారా?.. అందుకోసం మయొనైజ్ బదులు వీటిని వాడమని సలహా ఇస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
కాజూ క్రీమ్: జీడిపప్పులతో తయారుచేసుకున్న క్రీమ్‌ని కూడా డిప్ కోసం ఉపయోగించవచ్చంటున్నారు నిపుణులు. అందుకోసం ఓ రెండు కప్పులు తీసుకుని ఒకదానిలో జీడిపప్పుని, మరోదానిలో రెండు ఖర్జూరాలనూ రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని కడిగి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానికి కాస్త వెనిగర్ కూడా చేర్చితే కమ్మగా, తియ్యగా క్రీమీగా ఉంటుంది. జీడిపప్పులో మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. హై ప్రొటీన్స్, తగినంత కాల్షియం కూడా జీడిపప్పులో దొరుకుతుందని చెబుతున్నారు.
మస్టర్డ్ సాస్: ఆవాల్ని కడిగి పెట్టుకోవాలి. ఆపై రెండు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, చెంచా ధనియాల పొడి, చిటికెడు పంచదార, రుచికి తగినంత ఉప్పు తీసుకుని మిక్సీలో వేయండి. ఆ తర్వాత కొన్నినీళ్లు పోసి మెత్తగా రుబ్బి... ఆ మిశ్రమంలో నిమ్మరసం పిండితే సరిపోతుంది. మస్టర్డ్ సాస్ రెడీ. శాండ్ విచ్‌ని దీంతో తినొచ్చు. ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా.
హమస్: ఉడకబెట్టిన శనగలు, ఆలివ్‌నూనె, వెల్లుల్లి, ఉల్లి, కొన్ని మిరియాలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి కాస్త వెనిగర్ చేర్చితే భలే రుచిగానూ ఉంటుంది. మయొనైజ్ కంటే తక్కువ కేలరీలు, హై ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అన్నీ ఇందులో ఉంటాయి.
అవకాడో: ఇది మయొనైజ్‌కు చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. సహజంగానే స్మూత్‌గా ఉండే అవకాడో గుజ్జును మెత్తటి పేస్ట్‌గా చేసుకోవాలి. అందులోకి కొద్దిగా నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర.. వంటివి యాడ్ చేసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. శాండ్‌విచ్, ర్యాప్స్, ఎగ్ డ్రస్సింగ్ కోసం దీన్ని ఉపయోగింవచ్చని చెబుతున్నారు.
తులసి: కొన్ని రకాల స్నాక్స్ ఆర్డర్ చేసినప్పుడు.. మయొనైజ్, కెచప్‌తో పాటు గ్రీన్ సాస్ కూడా అందిస్తారు. దీన్నే ‘పెస్టో’ అంటారు. తులసి, చీజ్, పైన్ నట్స్,ఆలివ్ నూనె.. వంటి పదార్థాలతో తయారయ్యే ఈ క్రీమ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది కూడా మయొనైజ్‌కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమే అంటున్నారు నిపుణులు.
పెరుగు: ఇది అన్నంలో కలుపుకొని తినడానికే కాదు.. డిప్ క్రీమ్‌గానూ దీన్ని వాడుకోవచ్చు. ఈ క్రమంలో మార్కెట్లో దొరికే ‘గ్రీక్ యోగర్ట్’ను ఎంచుకోవచ్చు.. లేదంటే ఇంట్లో ఉండే గడ్డ పెరుగునే కాసేపు గిలక్కొట్టి క్రీమ్‌లా తయారుచేసుకోవాలి. ఇందులో కాస్త నిమ్మరసం, కొద్దిగా ఉప్పు కలిపామంటే పుల్లపుల్లగా టేస్ట్ అద్దిరిపోతుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే ఈ పెరుగు క్రీమ్‌ను డిప్‌గా ఉపయోగించుకోవచ్చు.. లేదంటే సలాడ్స్, శాండ్‌విచ్ డ్రస్సింగ్‌గానూ వాడుకోవచ్చు.
స్వీట్ షాప్ స్టైల్ "దాల్మోత్ మిక్చర్" - ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకోండి! - 2 నెలలు ఫ్రెష్‌గా!