రాష్ట్ర బడ్జెట్...... వైకాపా మేనిఫెస్టోకు రూపంలా ఉందని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి శాసనసభలో విమర్శించారు. సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం వాస్తవాలు మాట్లాడకుండా.... అంకెలకు పొంతన లేకుండా చెప్పడం అధికార పార్టీకి మంచి పద్ధతి కాదని సూచించారు. వృద్ధి రేటు రెండంకెలు పెరగడం అభివృద్ధి కాదా? అని బుచ్చయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం, ప్రణాళిక శాఖ కలిసి ప్రచురించిన సామాజిక, ఆర్థిక సర్వేపై తమను ప్రశ్నించడం సరి కాదని ఆర్థికమంత్రి రాజేంద్రనాథ్ అన్నారు.
ఆనంతరం బడ్జెట్‌పై చర్చలో గోరంట్ల మాట్లాడుతూ... రెవెన్యూ పెంచుకుంటూ.. బడ్జెట్ పెంచుకుంటూ వచ్చామని...ప్రతిదానిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. చేసిన అభివృద్ధి, తెచ్చిన ఉపాధిని విమర్శిస్తున్నారుని నిప్పులు చెరిగారు.
వైఎస్‌ఆర్ వడ్డీ పథకానికి రూ.3500 కోట్లు అవసరమవుతాయని... దానికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని ప్రశ్నించారు. రూ. 11 వేల కోట్లు బకాయి ఉందని చెప్పి... ఎన్ని నిధులిచ్చారని నిలదీశారు.
'ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.13 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 40 నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి... దాదాపు రూ.90 వేల కోట్లు కావాల్సి ఉండగా.. రూ.13 వేల కోట్లు ఎలా సరిపోతాయి?' - గోరంట్ల బుచ్చయ్య
ఉగాదినాటికి 25 వేల పట్టాలు ఇస్తామని...5 లక్షల ఇళ్లు కడతామని సీఎం మాట ఇచ్చారని... ఆ లెక్కల ప్రకారం ఇళ్ల నిర్మాణాలకు సంవత్సరానికి రూ.45 వేల కోట్లు కావాలని బుచ్చయ్య చౌదరి అన్నారు. బడ్జెట్‌లో చేసిన కేటాయింపులతో ఇళ్లన్నీ ఎలా కడతారని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. రూ.27 వేల కోట్ల డ్వాక్రా రుణాలను ఎప్పుడు రద్దు చేస్తారని వైకాపా ప్రభుత్వాన్ని అడిగారు.