ఈవీఎంల లోపాలను సరిచేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం విఫలమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఎన్సీపీ, కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారం చేయడానికి ముంబయి వెళ్లిన సీఎం... అక్కడ అఖిలపక్షంతో కలిసి మీడియా ముందుకొచ్చారు. మోదీ హయాంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు నిర్వీర్యమయ్యామని చంద్రబాబు ఆరోపించారు. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. తమిళనాడు, కర్నాటకలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపైనే దాడులు చేయడమేంటని నిలదీశారు. ఈవీఎంల లోపాలను సరిచేయడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోందని ఆక్షేపించారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని వివరించారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు కలిసి సుప్రీంకోర్టుకు వెళ్లాయని గుర్తు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడు 2 రోజుల్లో లెక్కింపు పూర్తయ్యేదని... అలాంటింది వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు 6 రోజులు పడుతుందని ఎన్నికల సంఘం చెప్పడం హాస్యాస్పదమన్నారు.
భాజాపాయేతర ప్రభుత్వం రావాలి
ఎవరికి ఓటు వేశామనేది వీవీప్యాట్‌లో 7 సెకన్లు కనపడాల్సి ఉండగా... కేవలం 3 సెకన్లే కనిపిస్తోందని అన్నారు. వీవీప్యాట్‌ల కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారని ప్రశ్నించారు. ఈవీఎంలోని ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పులు సరిపోల్చాలని స్పష్టం చేశారు. పోలింగ్ రోజున ఈవీఎంల్లో లోపాలు వస్తే సరిచేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడం ఆశ్యర్యకరమని మండిపడ్డారు. ఉదయం ఈవీఎంల్లో లోపాలు వస్తే మధ్యాహ్నానికి సరిచేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఓటు వేసేందుకూ సీఈవో ద్వివేది కూడా ఇబ్బందిపడాల్సిన పరిస్థితి నెలకొందని అసహనం వ్యక్తపరిచారు. భాజపా ఆర్థిక విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేశారని... మోదీ పాలనలో రూపాయి విలువ బాగా క్షీణించిందని విమర్శలు గుప్పించారు. కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.