కేక రాకముందే కాక..
ఎన్నికల కేక రాకముందే...రాజకీయ కాక మెుదలైంది. మరో వారం, పది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నప్రచారంతో రాజకీయ వర్గాలు అప్రమత్తమయ్యాయి. లోక్‌సభతోపాటే ఏపీ సహా మరో 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రకటన వెలువడక ముందే క్షేత్రస్థాయిలో బలాబలాలు తేల్చుకునేలా పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ప్రజాకర్షక మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిలో పడ్డాయి.
ఉక్కపోతతో గోడ దూకుడు
ఈ పార్టీ కాకపోతే... ఆపార్టీ... అదీ వద్దనుకుంటే ఇంకోటి... అనే పరిస్థితుల్లో అభ్యర్థులు లేరు. ఆచితూచి అడుగులేస్తూ పార్టీలు మారుతున్నారు. ఈ జంప్ జిలానీల పర్వంలో పార్టీలూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. పట్టులేని జిల్లాల్లోని ముఖ్యనేతలను ఆహ్వానించి... ప్రజాభిమానం పొందాలని భావిస్తున్నాయి. అందుకే పార్టీలు మారే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతోంది.
సమీక్షలు, వ్యూహాలు
ఎన్నికల శంఖారావం రాకముందే...అధినేతలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో మునిగారు. నేతలను ఇంటికి పిలిపించి మరీ... సమీక్షలు చేస్తున్నారు. గెలుపునకు వ్యూహ, ప్రతివ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తలను సైతం సమీక్షలకు ఆహ్వానిస్తున్నారు.
అసమ్మతి సెగలు
చాలా స్థానాల్లో అభ్యర్థులను పార్టీలు ఇప్పటికే ఖరారు చేశాయి. నేతల మధ్య పోటీ ఉన్న సీట్లను పెండింగ్‌లో పెట్టాయి. అసమ్మతులను బుజ్జగిస్తున్నాయి. ఇంకోలా న్యాయం చేస్తామంటూ భరోసా కల్పిస్తున్నాయి. ఇవేవీ పట్టించుకోని కొందరునేతలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. తమ నేతకే టికెట్ ఇవ్వాలని అనుచరులూ డిమాండ్ చేస్తున్నారు.
ఒకే చోట ఉప్పూనిప్పు
ఈ ఎన్నికల్లో మరో సరికొత్త కోణం కనిపిస్తోంది. ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కొంతమంది నేతల మధ్య పోరు ఉండేది... ప్రస్తుతం తీరు మారింది. అలాంటి నేతలంతా... ఒకే జెండా కిందకు వచ్చి ఒకరి గెలుపు కోసం మరొకరు ప్రచారం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని పక్కనబెట్టి కలిసి పార్టీల జెండాలు మోస్తున్నారు.