Volunteer Harassment on Married Woman: బాపట్ల జిల్లాలో ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న సమయంలో వివాహితపై అసభ్యకరంగా వ్యవరించాడో వాలంటీర్. అరుగుపై కూర్చున్న ఆమెను ఇంట్లోకి లాక్కెళ్లబోయాడు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో బాధితురాలిని హెచ్చరిస్తూ అక్కడి నుంచి వాలంటీర్ పరారయ్యాడు. అయితే కొద్దిసేపటికే అతడు తన అనుచరులు, బంధువులతో కలిసి బాధితురాలి ఇంటివద్దకు కర్రలు పట్టుకుని వచ్చి.. వారిని భయబ్రాంతులకు గురిచేశాడు.
బాలికను వేధిస్తున్న గ్రామవాలంటీర్పై ఫోక్సో కేసు
బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని బాప్టిస్టుపాలేనికి చెందిన ఓ వివాహిత ఆదివారం ఇంటిముందు అరుగుపై కూర్చున్నారు. ఆ సమయంలో గాలిమోటు లోకకుమార్ అనే వాలంటీర్ ఆమె వద్దకు వచ్చి.. "నువ్వంటే నాకు ఇష్టం" అంటూ వివాహిత చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. అతడి మాటలకు కంగుతిన్న ఆమె.. కాసేపటికి తేరుకుని.. అతడి నుంచి విడిపించుకుంటూ కేకలు వేశారు. దీంతో కేకలు వేస్తున్న ఆమెను ఎందుకు అరుస్తున్నావ్ అంటూ వాలంటీర్ కాలితో తన్నాడు. దీంతో ఆమె కిందపదిపోయారు. ఆమె అరుపులకు చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకోవటంతో 'నీ అంతు చూస్తా' అంటూ అతడు హెచ్చరిస్తూ వెళ్లిపోయాడు.
అయితే కాసేపటికి అతడు తన బంధువులు, అనుచరులను వెంటబెట్టుకుని కర్రలను తీసుకునివచ్చాడు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని.. బాధితురాలిని ఆమె బంధువులు ఆటోలు తీసుకుని చెరకుపల్లికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతేడాది కూడా ఇలాగే ఆ వాలంటీర్ తనతో అమానుషంగా ప్రవర్తించాడని, దీనిపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని బాధితురాలు వాపోయారు. వాలంటీరే తనపై దౌర్జన్యానికి పాల్పడి.. తిరిగి వారిపైనే కేసులు పెడతామని బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఏమైనా అంటే తన వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నారంటూ బెదిరిస్తున్నాడని బాధితురాలు తెలిపారు. వాలంటీర్, అతడి అనుచరులు, బంధువులతో తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశారు.
గ్రామ వాలంటీర్ వేధింపులు... వివాహిత ఆందోళన
దీంతోపాటు వాలంటీర్ లోకకుమార్ తమ గ్రామంలో తనలాంటి ఎంతో మంది నుంచి వడ్డీకి డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకపోగా.. దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నాడని వార్డు సభ్యురాలు మరియమ్మ వాపోయారు. తాము వైసీపీ వారిమేనని, అయితే వాలంటీర్ అరాచకాలకు తట్టుకోలేకపోతున్నామని కొందరు మహిళలు పోలీసుల వద్ద విలపించారు. పింఛను ఇచ్చే నెపంతో తమ ఇళ్లకు వాలంటీర్ వచ్చి.. తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, అందుకే అతడిని తమ ఇళ్లకు రానీయడం లేదని కొందరు మహిళలు పోలీసులకు తెలిపారు.