Amaravati Farmers Maha padayatra: రాజధాని రైతుల మహాపాదయాత్ర 7వ రోజున బాపట్ల జిల్లా నగరం నుంచి ప్రారంభమైంది. నగరంలోని ఓ ప్రైవేటు కళాశాల ప్రాంగణంలో రైతులు శనివారం రాత్రి బస చేశారు. అక్కడే వేంకటేశ్వర స్వామి రథంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్, ఐకాస నేతలు పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని రైతులతో పాటు స్థానికులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు మహాపాదయాత్రలో పాల్గొన్నారు. రైతుల పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రజలు ఎక్కడికక్కడ స్వాగతం పలికారు. అమరావతి అంశంపై హైకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడాన్ని ఐకాస నేత శివారెడ్డి, గద్దె తిరుపతిరావు తప్పు పట్టారు. తీర్పు వచ్చిన 6 నెలల తర్వాత పిటిషన్ వేయటం ఏమిటని ప్రశ్నించారు. పాదయాత్ర మార్గంలో వైసీపీ నేతలు మూడు రాజధానుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటాన్ని వారు తప్పుబట్టారు. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
బాపట్ల జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి రైతుల పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఇవాళ నగరం, బెల్లంవారి పాలెం, ఏలేటి పాలెం, చిరకాలవారి పాలెం, సజ్జావారిపాలెం, గుడికాయలంక, ఇసుకపల్లి, బేతపూడి సెంటర్ మీదుగా రేపల్లె చేరుకుంది. రైతుల పాదయాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పాదయాత్ర మార్గంలోని గ్రామాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఆదివారం కావటంతో ఇతర జిల్లాల ప్రజలు పాదయాత్రకు వచ్చి సంఘీభావం తెలిపారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో షిటిషన్ వేయడాన్ని రాజధాని రైతులు తప్పుబడుతున్నారు. ప్రభుత్వ చర్య కాలయాపనకే తప్ప ఉపయోగం లేదని వారు అభిప్రాయపడ్డారు. హైకోర్టు ధర్మాసనం అమరావతికి అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. ఇప్పుడు జగన్ సుప్రీంకు వెళ్లినా, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లినా తీర్పు మారదన్నారు. న్యాయం, ధర్మం తమ వైపే ఉంది కాబట్టి పైకోర్టులో విజయం సాధిస్తామని రైతులు విశ్వాసం వెలిబుచ్చారు. రైతుల పాదయాత్ర సాగే మార్గంలో ఇవాళ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానులు కావాలంటూ ఫ్లెక్సీలు కట్టారు. రైతులను రెచ్చగొట్టడం కోసమే వైసీపీ ప్రభుత్వ ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని.. వాటిని శాంతియుతంగానే ఎదుర్కొంటామని చెబుతున్నారు.
మూడు రాజధానుల అంశం జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ మాత్రమేనని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. బాపట్ల జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్రకు ఆయన మద్ధతు తెలిపారు. అమరావతి రైతులు అధైర్యపడాల్సిన పనిలేదని, రాజధాని అమరావతిలోనే ఉంటుందని భరోసావనిచ్చారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తర్వాత సుప్రింకోర్టుకు వెళ్లడం ఏంటనీ మండిపడ్డారు. రైతులను ఉత్తరాంధ్రకు వెళ్లొద్దని చెప్పటం సరికాదని.. తను ఇప్పుడు రాయలసీమ నుంచి ఇక్కడకు వచ్చానన్నారు. తనను ఎవరూ ఆపలేదని గుర్తుచేశారు. తమ ప్రాంతంలో కూడా పాదయాత్ర చెపట్టాలని రైతులను కోరారు. అమరావతి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుందన్నారు. మేము రాయలసీమ నుంచి విశాఖ వెళ్లాలంటే 12 వందల కిలోమీటర్లు వెళ్లాలని.. రైతులను మానసికంగా బయపెట్టటం కోసమే సీఎం యత్నిస్తున్నారని జేసీ దుయ్యబట్టారు.
ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చే విధానం.. ప్రపంచంలో ఎక్కలా లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. పాదయాత్రలో పాల్గొని రైతుల వెంట నడిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర కొత్తగా ఏర్పడినప్పుడు అమరావతిని రాజధానిగా అందరూ కలిసి నిర్ణయించారన్నారు. ఇప్పుడు జగన్ తమ ప్రభుత్వం వచ్చిందని రాజధాని మార్చడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును 6 నెలలుగా అమలు చేయకుండా.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల ఉపయోగం ఉండదని అన్నారు.
అమరావతి రైతుల మహా పాదయాత్ర సుధాకర్ అనే ప్రవాసాంద్రుడు భారీ విరాళం అందజేశారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కంచర్ల సుధాకర్ రూ. 25 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా ఐకాస నేతలకు అందించారు. రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని కంచర్ల సుధాకర్ అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు అమరావతి ద్వారా వస్తాయన్నారు.
రైతుల పాదయాత్ర ఇవాళ రేపల్లెలో ముగిసింది. రేపల్లె శివారులోని మెడికల్ అసోసియేషన్ హాల్లో రైతులు బస చేశారు. సోమవారం నాడు రైతుల పాదయాత్రకు విరామం ప్రకటించారు.
ఇవీ చదవండి: